సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఓ బేబీ' ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు అతిధులుగా విచ్చేశారు. వారిలో మంచు లక్ష్మీ కూడా ఓ అతిథిగా మెరిశారు. అతిథి సంగతి సరే, మైకు దొరికింది కదా.. అని స్టేజ్ ఎక్కి, నోటికి వచ్చినట్లు మాట్లాడితే, మహిళా సంఘాలు ఊరుకోవు మరి.
అదేంటీ.. 'బేబీ' ఈవెంట్‌లోకి, మహిళా సంఘాల్ని లాక్కొస్తారేంటని కోప్పడకండి. కాస్త ఆగితే అసలు విషయం తెలుస్తుంది. సరే, ఆ లింకు సంగతేంటో, అక్కడికే వచ్చేస్తున్నాంలెండి. 'ఓ బేబీ' ట్రైలర్‌లో 'నీకెలాంటి భర్త కావాలి..' అని నాగశౌర్య సమంతను అడిగితే, మంచివాడై ఉండాలి.. అందంగా ఉండాలి.. డబ్బులుండాలి.. మంచమెక్కితే మగాడిలా కాపురం చేయాలి..' అనే డైలాగ్ ఉంది కదా.. ఆ డైలాగే మంచు లక్ష్మి కొంప ముంచింది. సమంత చెబితే క్యూట్‌గానే అనిపించింది. హిలేరియస్‌గా నవ్వు తెప్పించింది.
కానీ, పబ్లిగ్గా స్టేజ్‌పై ఈ డైలాగ్ మంచు లక్ష్మి నోటి నుండి ఆణిముత్యంలా వచ్చేసరికి మహిళా సంఘాలు ఒక్కసారిగా ఫైర్ అయిపోయాయెందుకో మరి. యావత్ మహిళా సంఘానికి మంచు లక్ష్మి క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, మంచు లక్ష్మి క్షమాపణలు చెబుతుందో లేదో తర్వాతి సంగతి కానీ, ఈ వివాదంతో ఇన్‌డైరెక్ట్‌గా మంచు లక్ష్మి 'ఓ బేబీ' ప్రమోషన్స్‌కి సహకరించినట్లైంది కదా.