'దొంగ దొంగది' సినిమాతో మంచు వారి ఫ్యామిలీ నుండి హీరోగా తెలుగు తెరకు పరిచయమైన మంచు మనోజ్ విభిన్న కథలను ఎంచుకుంటూ, విలక్షణ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. కమర్షియల్ చిత్రాలకు దూరంగా, డిఫరెంట్ కథా చిత్రాల్లో నటించేందుకు ముందుంటాడు మంచు మనోజ్.
అయితే ఈ మధ్య మంచు మనోజ్‌కి సోషల్ మీడియాలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది నెటిజన్లు మనోజ్‌ని ఆడి పోసుకుంటున్నారు. తండ్రి పేరు చెప్పి బతికేస్తున్నారు.. అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి మంచు మనోజ్ స్పందించారు. 'తండ్రి సంపాదనతో బతికడం అనే విషయాన్ని నేను కాలేజీ రోజులు నుండే మర్చిపోయాను. ఓ పక్క చదువుకుంటూనే హోటల్‌లో వెయిటర్‌గా పని చేసి డబ్బులు సంపాదించేవాడ్ని. నాన్న సంపాదనను ఖర్చు పెడితే ఆయన చాలా సంతోషిస్తారు. కానీ నేను ఆయనకు ఆ సంతోషాన్ని ఇవ్వలేకపోయాను..' అన్నారు. అలాగే నా సినిమాల ఎంపికను, నా దర్శకులను, నిర్మాతలను నేనే చూసుకుంటాను. వీటి విషయంలో ఎవరి సలహాలు, సూచనలు కూడా తీసుకోను..' అంటూ మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అవును నిజమే. మంచు మనోజ్ రూటే సెపరేటు. ప్రస్తుతం మంచు మనోజ్ నుండి రాబోయే సినిమాలు ఏమీ లేవనే చెప్పాలి. తొందరపడి ఏవో ఒక సినిమాలు చేసేయకుండా, ఆచితూచి విభిన్న కథలను ఎంచుకోవడానికే మంచు మనోజ్ ఎప్పుడే ఆలోచిస్తూంటాడు.