సినిమా కోసం ఎంతటి డెడికేషన్ అయినా తప్పదంటాడు మంచు మనోజ్. ఆ డెడికేషన్‌తోనే లావెక్కడం, సన్నబడటం అనేవి చేస్తుంటానని అన్నాడాయన. 'ఒక్కడు మిగిలాడు' సినిమా కోసం ఇంతలా లావెక్కాల్సి వచ్చిందని చెబుతూ, అదొక ప్రయోగాత్మక చిత్రమని అన్నాడు. ఆ ప్రత్యేకత ఏంటో నేను చెబితే బాగుండదనీ, సినిమాలోనే చూడాలని మనోజ్ సస్పెన్స్ క్రియేట్ చేశాడు. తాజాగా మనోజ్ నటిస్తున్న 'గుంటూరోడు' ఆడియో విడుదల వేడుక జరిగింది. ఈ వేడుకలో మనోజ్, సినిమా పట్ల తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. నిర్మాతకి బడ్జెట్ తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే తన సినిమాలకు తానే ఫైట్స్ సమకూర్చుకుని, ఒళ్ళు హూనం చేసుకుంటాను తప్ప ఇంకో ఆలోచన లేదన్నాడు. తన సినిమాలకి తక్కువ బడ్జెట్ ఉంటుందని, ఆయన సభా ముఖంగా చెప్పడం కూడా ఆయన వ్యక్తిత్వాన్ని చాటి చెబుతోంది. అయితే 'గుంటూరోడు' సినిమా కోసం మాత్రం ఫైట్ మాస్టర్‌ని పెట్టుకున్నానని మనోజ్ చెప్పాడు. ఈ సినిమాకి ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయట. అలాగే అన్ని రకాల కమర్షియల్ హంగులూ ఉంటాయంటున్నాడు. ఇంతవరకూ విలక్షణ చిత్రాలనే ట్రై చేయాలనుకున్న మనోజ్ ఇకపై కమర్షియల్ మూవీస్‌ని కూడా చేస్తానన్నాడు. తన నుంచి ఫ్యాన్స్ కోరుకునేది అదేననీ, వారి కోరిక తీర్చడమే ఒక నటుడిగా నా బాధ్యత అనీ మనోజ్ అభిమానులకు భరోసా ఇచ్చారు. 'గుంటూరోడు' సినిమాతో కమర్షియల్ సక్సెస్ దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు మనోజ్.