మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ప్రచార వేడి పెరిగింది. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉండటంతో అందరి చూపు ఎన్నికలపై పడింది. ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలో మెగాస్టార్ చిరంజీవి ఓటు తనకే వేస్తారని ధీమా వ్యక్తం చేశారు .
'ఇంకా చిరంజీవి గారిని కలవలేదు. నామినేషన్ వేసిన తర్వాత మేనిఫెస్టో ప్రకటించి ఆయన్ని కలుస్తాను. నా విజన్ విన్నాక ఆయన తప్పకుండా నాకు ఓటు వేస్తారనుకుంటున్నా. ఇప్పటివరకూ మా నాన్న 800 మంది ఆర్టిస్ట్‌లకు ఫోన్ చేసి.. మీ సహకారం కావాలి అని కోరగా వాళ్లందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారని చెప్పుకొచ్చారు విష్ణు.
అంతేకాదు.. 'మా'లో చాలా సమస్యలు ఉన్నాయి. అధ్యక్షుడిగా ఎన్నికైతే ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని నేనే భరిస్తా. నిర్మాతగా దెబ్బతిన్నప్పటికీ.. అప్పు తీసుకువచ్చి దాన్ని నిర్మిస్తాని హామీ ఇచ్చారు విష్ణు. ‘మా’ భవనం అనేది ఎప్పటినుంచో వున్న సమస్య. ఐతే ఇప్పుడు తన సొంత డబ్బుతో ఆ భవనం నిర్మిస్తామని చెప్పడం పెద్ద హామీ అనే చెప్పాలి.