మంచు విష్ణు కథానాయకుడే కాదు. నిర్మాత కూడా. తన సినిమాల్లో దాదాపు సగం... తానే నిర్మించుకున్నాడు. ఒక్కోసారి హిట్లొచ్చినా, చాలాసార్లు.. నష్టాల్ని భరించాల్సివచ్చేది. తాజాగా `మోసగాళ్లు` విషయంలోనూ విష్ణు చాలా నష్టపోయినట్టు టాలీవుడ్ టాక్. ఈసినిమా కోసం విష్ణు 50 కోట్లు ఖర్చు పెట్టాడట. ప్రమోషన్ల కోసం 50 కోట్లు అంటున్నా... కనీసం 30 కోట్లయినా ఖర్చవుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి.
ఈ సినిమాని ఎవ్వరూ కొనలేదు. విష్ణునే సొంతంగా విడుదల చేసుకున్నాడు. తీరా చూస్తే.. ఇప్పుడు డిజాస్టర్ టాక్ వచ్చింది. తొలి మూడు రోజుల్లో వసూళ్లు అద్దెలకు సరిపోయిందని టాక్. అంటే.. ఈ సినిమా నుంచి విష్ణుకి ఒక్క పైసా కూడా తిరిగిరాలేదన్నమాట. ఈ సినిమా కోసం 20 కోట్ల వరకూ ఫైనాన్స్ తీసుకున్నారని సమాచారం. ఆ 20 కోట్లూ ఇప్పుడు విష్ణు తీర్చాలి.
విడుదలకు ముందు రోజు.. ఫైనాన్షియర్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని, ఆ సమయంలో మోహన్ బాబు సొంత పూచీకత్తుపై ఈసినిమాకి క్లియరెన్స్ తెచ్చుకుని, సినిమాని విడుదల చేశారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ అప్పుల్ని తీర్చే బాధ్యత కూడా... మోహన్ బాబుపై పడిందని సమాచారం. మరి ఈ గండం నుంచి విష్ణు ఎలా గట్టెక్కుతాడో?