శ్రీ రెడ్డి అంశం రోజురోజుకి కొత్త మలుపు తిరుగుతున్నది. అయితే శ్రీ రెడ్డి తెలిపిన నిరసన, చేసిన వ్యాఖ్యలకి ఒకరకంగా అందరికన్నా ఎక్కువ నష్టపోయింది MAA. ఆది నుండి శ్రీ రెడ్డి MAA పైన విమర్శలు చేయడం ఆ తరువాత వారు వాటిని తిప్పికొట్టడంతో మళ్ళీ ఈ వివాదం తిరగబెట్టింది.
ఇక తాజాగా నిర్మాత-నటుడు అయిన మంచు విష్ణు ఈరోజు MAAని ఉద్దేశ్యించి ఒక బహిరంగ లేఖని విడుదల చేశాడు. ఆ లేఖలో అసలు MAAకి ఒక నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూనే.. శ్రీ రెడ్డికి సభ్యత్వం ఇవ్వము అని చెప్పి మళ్ళీ ఇస్తాము అని చెప్పడంతో అసలు MAA పైన అందరికి ఒకరకమైన చులకన భావం ఏర్పడింది అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
అలాగే ఆమెని బహిష్కరించడానికి MAA సభ్యులు అందరు ఒప్పుకున్నారు అని చెప్పడం.. మరి తన ఇంటిలో MAA సభ్యులు నలుగురు ఉన్నారు అని తమని ఎవ్వరు ఈ విషయంలో సంప్రదించలేదు అని ప్రశ్నించారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాల్సిందిగా అందులో అన్ని శాఖల నుండి సభ్యులని చేయాలని సూచించారు.
ఇలా సూచనలు, ప్రశ్నలతో MAA పై విడుదల చేసిన ఈ లేఖపై MAA ఇంకా స్పందించలేదు. మరి రేపైనా స్పందిస్తారో లేదో చూడాలి..