'బాహుబలి' గురించి దేశమంతా మాట్లాడుకుంది, మాట్లాడుకుంటూనే ఉంది. ఒకపై 'మణికర్ణిక' సినిమా గురించి దేశమంతా మాట్లాడుకోవడం మొదలుపెడుతుంది. ఎందుకంటే 'మణికర్ణిక' చిత్రానికి దర్శకుడు మనోడే. 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా 'మణికర్ణిక'. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ సినిమాలో 'మణికర్ణిక'గా నటించబోతోంది. ఈ సినిమా ప్రీ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. స్వాతంత్య్ర సమరయోధురాలు, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వీరగాధ నేపథ్యంలో ఈ 'మణికర్ణిక' రూపొందుతోంది. రాణి ఝాన్సీ లక్ష్మీ బాయి అసలు పేరు మణికర్ణిక. ఆ అసలు పేరుతోనే ఆమె జీవిత గాధను సినిమాగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. బాలీవుడ్‌లో రూపొందుతున్న ఈ సినిమా సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఉండబోతోందనడం నిస్సందేహం. ఎందుకంటే పరిమిత బడ్జెట్‌తోనే 'కంచె', 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి అత్యద్భుత చిత్రాలను రూపొందించాడాయన. భారీ బడ్జెట్ చేతికి దొరికితే క్రిష్ సృష్టించే సంచలనాలకు ఆకాశమే హద్దు అవుతుంది. 'బాహుబలి'తో ఇప్పటికే తెలుగు సినిమా సత్తా చాటిన దర్శకుడిగా రాజమౌళి దేశవ్యాప్త, ప్రపంచ వ్యాప్త గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ కోవలో క్రిష్ కూడా ప్రపంచ ఖ్యాతినార్జించేందుకు 'మణికర్ణిక'తో తయారవుతుండడం అభినందనీయం.