ప్రముఖ దర్శకుడు మణిరత్నం గుండెపోటు కారణంగా చికిత్స నిమిత్తం చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన గుండెపోటు వార్త తెలిసి చిత్ర పరిశ్రమ అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
మణిరత్నం నుండి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఏ భాషలో సినిమా చేసినా అది దాదాపుగా భారతదేశంలోని అన్ని భాషల్లోనూ సినీ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాయి. మణిరత్నం ప్రముఖ సినీ నటి సుహాసిని భర్త. ఇటీవల మణిరత్నం 'చెలియా' సినిమాని రూపొందించి, ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రేమకథల్ని అందమైన దృశ్య కావ్యాలుగా మార్చడం, ఆ ప్రేమకథలకు అత్యద్భుతమైన నేపథ్యాన్ని ఎంచుకోవడం ఇవన్నీ మణిరత్నంకు మాత్రమే చెల్లాయి.
కథ కథనం, సినిమాటోగ్రఫీ, సంగీతం, మాటలు ఇలా ఏ విభాగాన్ని తీసుకున్నా తనదైన ముద్ర కనిపించేలా మణిరత్నం సినిమాల్ని తెరకెక్కిస్తుంటారు. గతంలో ఓసారి మణిరత్నం అనారోగ్యానికి గురయ్యారు. మళ్లీ కోలుకుని మంచి విజయాల్ని అందుకున్నారు. మంచి సినిమాలు భారతీయ సినీ పరిశ్రమకు అందించారు.
ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్న మణిరత్నం త్వరలోనే కోలుకుని మరిన్ని మంచి సినిమాలు మనకి అందించాలని ఆశిద్దాం.