'బాహుబలి' చిత్రాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు రాజమౌళి అయితే, ఇప్పుడు ఆ తరహా భారీ బడ్జెట్ చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. మణిరత్నం సినిమా అంటేనే ఓ స్థాయి అంచనాలుంటాయి. ఇక ఆయన ప్రతిష్ఠాత్మకంగా రూపొందించే చిత్రమంటే, ఆ అంచనాలకు ఆకాశమే హద్దవుతుంది. ఇంతకీ మణిరత్నం తెరకెక్కించబోయే సినిమా ఏంటంటే, అలనాటి నటీ నటులు ఎంజీఆర్, జయలలిత వంటి వారు నటించాలని కలలు కన్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్'.
అప్పటి నుండీ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇది. అయితే అప్పట్లో బడ్జెట్ అడ్జస్ట్‌మెంట్స్, మార్కెటింగ్ వేల్యూస్ సెట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేకపోయింది. కానీ ఇప్పుడు సౌత్ సినిమా మార్కెట్ రేంజ్ మారిపోయింది. హద్దులు దాటి, ఎల్లలు దాటి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. సత్తా చూపిస్తోంది. 'బాహుబలి' సినిమానే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమాని ఆదర్శంగా తీసుకుని మరిన్ని భారీ ప్రాజెక్ట్ సినిమాలు రూపు దిద్దుకుంటున్నాయి.
ఇక, తాజా సినిమా విషయానికి వస్తే, విక్రమ్, జయం రవి, కార్తీ వంటి అగ్ర హీరోల కాంబినేషన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కీర్తిసురేష్ కీలక పాత్ర పోషిస్తోంది. అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్ తదితర బాలీవుడ్ అగ్ర తారాగణం కూడా ఈ సినిమాలో నటిస్తోంది. మలయాళ భామ అమలాపాల్‌తో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. జేజమ్మ అనుష్క కూడా కనిపించబోతోందనీ సమాచారమ్. ఇలా భారీ కాస్టింగ్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని మడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి రిలయన్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.