ఓటీటీ హవా నడుస్తోందిప్పుడు. బడా దర్శకులు సైతం పరిస్థితులకు తలొగ్గి, ఓటీటీ వైపు తప్పకుండా చూడాల్సిన పరిస్థితి. ఓటీటీ నుంచి వచ్చే పారితోషికాలు, వాళ్ల బడ్జెట్లూ ఏం తక్కువ కాదు. అందుకే స్టార్ డైరెక్టర్లు ఓటీటీ బాట పడుతున్నారు. లెజెండరీ దర్శకుడు మణిరత్నం కూడా ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ రూపొందించే పనిలో పడ్డారు. అమేజాన్ కోసం మణిరత్నం ఓ వెబ్ సిరీస్ తీస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో 9 ఎపిసోడ్లు ఉంటాయి. ఓ ఎపిసోడ్‌కి మణిరత్నం దర్శకత్వం వహిస్తారు. మిగిలిన ఎనిమిది ఎపిసోడ్లనీ ఎనిమిదిమంది దర్శకులు దర్శకత్వం వహిస్తారు. తెలుగు, తమిళ, హిందీ రంగాల్లో పేరొందిన దర్శకులతో ఈ ఎపిసోడ్లని రూపొందించాలన్నది మణిరత్నం ప్లాన్.
ఈ వెబ్ సిరీస్‌కి స్క్రిప్టు మొత్తం మణిరత్నమే అందిస్తున్నారు. దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఆయనే చూసుకుంటున్నారు. దాదాపు 50 కోట్లతో రూపుదిద్దుకుంటున్న వెబ్ సిరీస్ ఇది. మణిరత్నం లాంటి వాళ్లు టేకప్ చేశారంటే, అందులో స్టార్ దర్శకులు పని చేస్తారంటే.. ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. మరి ఆ వెబ్ సిరీస్ ఎప్పుడు మొదలవుతుందో? ఆ ఎనిమిది మంది దర్శకులు ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం ఓపిక పట్టాలి.