మను చరిత్ర మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

చిత్రం: మను చరిత్ర
నటీనటులు: శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, డాలీ ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్
దర్శకత్వం: భరత్ పెదగాని
 

నిర్మాత: ఎన్ శ్రీనివాస రెడ్డి
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్
కూర్పు: ప్రవీణ్ పూడి
 

బ్యానర్స్: ప్రొద్దుటూరు టాకీస్
విడుదల తేదీ: 23 జూన్ 2023


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5
 

ప్రేమ క‌థ‌ల్లో చాలా మార్పులు వ‌స్తున్నాయి. ల‌వ్ స్టోరీల్లో ఇంటెన్సిటీ కోరుకొంటున్నారు ఈత‌రం ప్రేక్ష‌కులు. అది లేక‌పోతే... ఎలాంటి ప్రేమ క‌థైనా బోర్ కొడుతోంది. ఆర్‌.ఎక్స్ 100, అర్జున్ రెడ్డి చిత్రాల్లోని ప్రేమ క‌థ‌ల కంటే, వాటిలోని ఇంటెన్సిటీనే ప్రేక్ష‌కుల‌కు బాగా కిక్ ఇచ్చింది. ఆయా సినిమాల ప్ర‌భావం ఇప్పుడొస్తున్న ల‌వ్ స్టోరీల్లో క‌నిపిస్తూనే ఉంది. `మ‌ను చ‌రిత్ర‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు అర్జున్ రెడ్డి, ఆర్‌.ఎక్స్ 100 ఫ్లేవ‌ర్లు క‌నిపించాయి. వాటిలోని ఇంటెన్సిటి... ఈ క‌థ‌లోనూ ఉంద‌నిపించింది. మ‌రి... నిజంగానే ఈ రెండు సినిమాల ప్ర‌భావం `మ‌ను చ‌రిత్ర‌`పై ఉందా? ఈ సినిమా యూత్ ని ఏ మేర‌కు ఆక‌ట్టుకొంటుంది?  మ‌ను చ‌రిత్ర‌... క‌థేమిటి?


క‌థ‌: వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో సాగే కథ ఇది. మను దుర్గరాజు (శివ కందుకూరి) శ్రావ్య (ప్రియా వడ్లమాని)ని ప్రేమిస్తాడు. శ్రావ్య కూడా మ‌నుని ఇష్ట‌ప‌డుతుంది. అయితే ఇంత‌లోనే శ్రావ్య‌కి అనూహ్యంగా బ్రేకప్ చెబుతాడు శివ‌. శ్రావ్య‌నే కాదు.. మ‌ను జీవితంలో చాలామంది అమ్మాయిలు వ‌చ్చి వెళ్తుంటారు. జెన్నీఫ‌ర్‌ (మేఘా ఆకాష్), జాను (ప్రగతి శ్రీవాత్సవ్) అనే ఇద్ద‌ర‌మ్మాయిలు మ‌ను జీవితంలో కీల‌క పాత్ర పోషిస్తారు. వాళ్లిద్దరూ ఎవ‌రు? అస‌లు ప్రేమ ప‌ట్ల‌... మ‌ను అభిప్రాయం ఏమిటి?  చివ‌రికి త‌న ప్రేమ క‌థ సుఖాంత‌మైందా?  దుఖాంత‌మైందా? ప‌క్కింటి అబ్బాయి లాంటి సాదా సీదా కుర్రాడు వరంగల్ మేయర్ జనార్దన్ (శ్రీకాంత్ అయ్యంగార్) హ‌త్య కేసులో ఎలా ఇరుకొన్నాడు?  త‌న కోసం పోలీసులు ఎందుకు వెదుకుతున్నారు?  ఇదంతా తెర‌పై చూసి తెలుసుకోవాల్సిన‌ విష‌యాలు.


విశ్లేష‌ణ‌: ప్రేమ చేసిన గాయానికి మందు ప్రేమ మాత్ర‌మే.. అనే పాయింట్ చుట్టూ న‌డిచిన క‌థ ఇది. దర్శ‌కుడు ఎంచుకొన్న పాయింట్ లో వైవిధ్యం ఉంది. క‌థానాయ‌కుడి పాత్ర‌ని కొత్త‌గా డిజైన్ చేసుకోవ‌డంలో వెసులుబాటు దొరికింది. ఈ క‌థ‌ని ఓ మ‌ర్డ‌ర్ సీన్ తో ప్రారంభించి - నేరుగా ప్రేక్ష‌కుడ్ని సినిమాలోకి లాక్కెళ్లిపోయే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కూడా చాలా ప‌వ‌ర్ ఫుల్ గా మాసీగా ఉంటుంది. ఆ త‌ర‌వాత‌.. ప్రేమ క‌థ మొద‌ల‌వుతుంది. ఈ సినిమాలో ఒక ప్రేమ క‌థ కాదు, చాలా ప్రేమ క‌థ‌లు ఉన్నాయి. వాటిని వీలైనంత ఫ్రెష్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. కొన్ని ట్రాక్‌లు పాత సినిమాల్ని గుర్తుకు తెస్తాయి. కాక‌పోతే అవి కూడా యంగేజింగ్‌గానే ఉన్నాయి. 


ఈ క‌థ‌లో మ‌రో కోణం.. రౌడీ ఇజం. ల‌వ్ స్టోరీలో ఈ యాంగిల్ అత‌క‌క‌దు. కానీ... ఈ రెండింటినీ ద‌ర్శ‌కుడు తెలివిగా మ్యాచ్ చేశాడు. దాంతో ఈ ల‌వ్ స్టోరీలో ఫ్రెష్‌నెస్ క‌నిపిస్తుంది. తొలి స‌గంలో... ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. చిన్న చిన్న కుదుపులు ఉన్నా.. ప్ర‌శాంతంగా సాగిపోతుంది. అయితే ద్వితీయార్థంతోనే అస‌లు స‌మ‌స్య‌. తొలి స‌గంలో చూపించిన కొన్ని సీన్లు రిపీట్ మోడ్ లో వ‌స్తుంటాయి. ద్వితీయార్థం లెంగ్త్ కూడా ఎక్కువే. సుహాస్ లాంటి క్యారెక్ట‌ర్ ఉన్నా, స‌రిగా వాడుకోలేదు. తొలి స‌గంలో.. ఈ ల‌వ్ స్టోరీకి గుండాయిజం అనే ఎలిమెంట్ దోహ‌దం చేసింది. మ‌ను పాత్ర‌లో ఉన్న ఇంటెన్సిటీ.. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. ఆ పాత్ర‌పై జాలి, ప్రేమ క‌లుగుతాయి. ఆయా సన్నివేశాలు యూత్ ని ఎంగేజ్ చేస్తాయి.


న‌టీన‌టులు: శివ‌ కందుకూరి ముందు నుంచీ విభిన్న‌మైన క‌థ‌లు ఎంచుకొంటూ ప్ర‌యాణం కొన‌సాగిస్తున్నాడు. ఒక‌దానితో మ‌రోటి పొంత‌న లేని పాత్ర‌ల్లోనే కనిపిస్తున్నాడు. మ‌ను కూడా అలాంటి పాత్రే. ఈ కారెక్ట‌ర్‌లో ఉన్న ఇంటెన్సిటీ ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తుంది. భావోద్వేగ‌భ‌రిత‌మైన స‌న్నివేశాల్లో చాలా బాగా న‌టించాడు శివ‌. త‌న కెరీర్‌లో గుర్తిండిపోయే పాత్ర‌ల్లో ఇదొక‌టి. ప‌క్కింటి అబ్బాయి ఇమేజ్‌కి భిన్న‌మైన గుర్తింపు ఈ సినిమా త‌న‌కు తీసుకొస్తుంద‌న‌డంలో సందేహం లేదు. హీరోయిన్ల సంఖ్య ఎక్కువ‌గానే ఉన్నా మేఘా ఆకాష్‌కి స్క్రీన్ స్పేస్ ఎక్కువ‌గా దొరికింది.ప్రియా వ‌డ్ల‌మాని ఆక‌ట్టుకొంటుంది. మిగిలిన వాళ్లంతా త‌మ పాత్ర ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించారు.

 

సాంకేతిక వ‌ర్గం: గోపీ సుంద‌ర్ సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. పాట‌లు బాగున్నాయి. నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకొంది. వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. వ‌రంగ‌ల్ ని కూడా ఓ పాత్ర‌గా చూపించ‌గ‌లిగాడు కెమెరా మెన్‌. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ క‌నిపించాయి. ప్రేమ‌కు సంబంధించిన డైలాగులు ఈ సినిమాలో కుప్ప‌లు తెప్ప‌లుగా ఉన్నాయి. అయితే వాటిలో ఆక‌ట్టుకొనేవి తక్కువే. ఆర్‌.ఎక్స్ 100, అర్జున్ రెడ్డి ఛాయ‌లు అక్క‌డ‌క్క‌డ ఉన్నా, వాటికి భిన్న‌మైన ప్రేమ‌క‌థ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. 


ప్ల‌స్ పాయింట్స్‌: 

శివ కందుకూరి న‌ట‌న‌
క‌థా నేప‌థ్యం
ల‌వ్ సీన్స్‌


మైన‌స్ పాయింట్స్‌:

ద్వితీయార్థం
సాగదీత


ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: ఇంటెన్ప్ ఉన్న ప్రేమ క‌థ‌..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS