చిత్రం: మార్టిన్ లూథర్ కింగ్
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, నరేష్, శరణ్య ప్రదీప్
దర్శకత్వం: పూజ కొల్లూరు
నిర్మాతలు: ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
సంగీతం: స్మరణ్ సాయి
ఛాయాగ్రహణం: దీపక్ యెరగేరా
కూర్పు: పూజ అపర్ణ కొల్లూరు
బ్యానర్స్: మహాయణా మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ: 27 అక్టోబర్ 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
మార్టిన్ లూథర్ కింగ్.. తమిళంలో విజయవంతమైన ‘మండేలా’కు రీమేక్‌గా రూపొందిన సినిమా ఇది. మాతృకలో యోగిబాబు పోషించిన పాత్రను ఇక్కడ సంపూర్ణేశ్ బాబు చేశారు. కులాలు, వర్గాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చుట్టూ నడిచే పొలిటికల్ సెటైర్ ఇది. తమిళంలో విజయం సాధించిన ఈ కథ తెలుగు ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంది ? మార్టిన్ లూథర్ కింగ్‌గా సంపూర్ణేశ్ ఎలాంటి వినోదాన్ని పంచారు ?
కథ: పడమరపాడు లో సర్పంచ్ ఎన్నికల నగారా మోగుతుంది. ఆ గ్రామంలో దక్షిణం లీడర్ లోకి (వెంకటేశ్ మహా), ఉత్తరం లీడర్ జగ్గు (నరేశ్) సర్పంచ్ పదవి కోసం పోటీ పడతారు. వారి ప్రచారంలో భాగంగా చేసిన సర్వేలో ఇద్దరికీ సమాన ఓట్లు పడనున్నట్లు ముందే అర్థమవుతుంది. దీంతో విజయానికి ఓ ఓటు కావాలి. అదే సమయంలో ఆ వూర్లో వుండే అనాధ స్మైల్ అలియాస్ మార్టిన్ లూథర్ కింగ్( సంపూర్ణేశ్ బాబు) ఓటు హక్కు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో లోకి, జగ్గు అతణ్ని తమవైపు తిప్పుకొనేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మరి మార్టిన్‌కు ఓటు ఎవరికి వేశాడు? అసలు మార్టిన్ లూధర్ కింగ్ ఎవరు ?అతనికి ఆ పేరు ఎలా వచ్చింది ? ఆ వూరు ఉత్తరం, దక్షిణం అని ఎందుకు విడిపోయారు ? మార్టిన్ ఓటు తో ఊరిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడనేది మిగతా కథ.
విశ్లేషణ: మండేలా అందరినీ ఆలోజింపచేసే పొలిటికల్ సెటైర్ మూవీ. దేశంలో ఎక్కడైనా ఈ కథ వర్తిస్తుంది. ఈ కథకు నేటివిటీ ఇష్యూ లేదు. ఇది ఓటు విలువని తెలియజెప్పే చిత్రం. ఒరిజినల్ లోని ఆత్మను దెబ్బ తీయకుండా తెలుగు వెర్షన్ ని ప్రేక్షకుల ముందుకు కొచ్చారు. పడమరపాడు గ్రామం.. అక్కడి ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేస్తూ వచ్చే మారుగుదొడ్డి ఓపెనింగ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా వుంటుంది. స్మైల్ పాత్రని ఎమోషనల్ గా కనెక్టింగ్ తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. పోస్టాఫీస్‌లోకి వెళ్ళడం, వసంతతో పరిచయమవడం.. ఆమె అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెట్టడం.. మరోవైపు ఊర్లోని ఓటర్లను ఆకర్షించేందుకు లోకి, జగ్గు డబ్బులతో ప్రలోభ పెట్టే సన్నివేశాలు.. ఇవన్నీ చక్కగా కుదిరాయి. ఇంటర్వెల్ బాంగ్ కూడా తర్వాత ఏమౌతుందనే ఆసక్తిని కలిగిస్తుంది.
మార్టిన్ ఓటు తమకు పడేలా చేసుకునేందుకు లోకి, జగ్గు చేపట్టే ప్రలోభాలు, పోటీ పడి అతనికి కానుకలు ఇవ్వడం.. అతను మాత్రం ఎవరికి ఓటు వేయాలో తెల్చుకోలేకపోతున్నాని చెప్పే సన్నివేశాలు సరదాగా వుంటాయి. అతని ఓటు కోసం కోటి రూపాయలు గుమ్మరించేందుకు ఇద్దరూ సిద్ధపడటం చూస్తే నాయకులు గెలుపు కోసం ఎంతవరకైనా తెగిస్తారనే వాస్తవానికి అద్దం పట్టేలా వుంటుంది. అప్పుడైతే మార్టిన్ ఓటు విలువ తేలుకొని గ్రామం అభివృద్ధి కోసం ఆలోచిస్తాడో అక్కడ నుంచి కథ మరింత ఆసక్తిగా వుంటుంది. ఆ సన్నివేశాలన్నీ ముందే ఊహకు అందుతాయి కానీ కనువిప్పు కలిగించేలా వుంటాయి.
నటీనటులు: సంపూర్ణేశ్ బాబుకు ఇది పూర్తిగా కొత్తతరహ పాత్ర. ఎమోషనల్ రోల్ లో చాలా సహజంగా నటించాడు. మార్టిన్ పాత్రకు న్యాయం చేశాడు. జగ్గు పాత్రలో నరేశ్ చాలా సహజంగా ఒదిగిపోయాడు. లోకి పాత్రలో వెంకటేశ్ నటన కూడా ఆకట్టుకుంది. వసంత పాత్రలో శరణ్య చాలా సెటిల్డ్ గా చేసింది. మిగిలిన పాత్రలు పరిధి మేరకు వున్నాయి.
టెక్నికల్: నేపధ్య సంగీతం, కెమరాపనితనం బావుంది. డైలాగుల్లో సహజత్వం ఉట్టిపడింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. కథని నిజాయితీగా చేసే ప్రయత్నం బావుంది. మండేలా కథలోని ఆత్మని చెడగొట్టకుండా మార్టిన్ కి ప్రజంట్ చేయడంలో దర్శకురాలు మంచి ప్రతిభ కనబరిచింది.
ప్లస్ పాయింట్స్
కథ, కథనం
సంపూర్ణేశ్ బాబు
అవసరమైన సందేశం
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ సాగదీత
సెకండ్ హాఫ్ లో కొన్ని రిపీట్ సీన్లు
ఫైనల్ వర్దిక్ట్.. ఆలోచింపజేసే ‘కింగ్’ మేకర్..