ఓటీటీ కాలమిది. అన్నిట్లోనూ వేగమే. సినిమాలు తీయడంలో ఇదే వేగం చూపించాలి. ఓటీటీ కోసం తీస్తున్న సినిమా అయితే.. ఇంకా జెట్ స్పీడులో ఉండాలి. మారుతి అదే చేస్తున్నాడు. ఆహా కోసం మారుతి ఓ సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాని కేవలం నెలరోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్.
యూవీ క్రియేషన్స్ నుంచి ఈమధ్య `ఏక్ మినీ కథ` అనే సినిమా వచ్చింది. రెండున్నర కోట్లతో తీసిన ఈ సినిమాని ఆమేజాన్ ఏకంగా 9 కోట్లకు కొనుగోలు చేసింది. చిన్న సినిమాల్లో ఇది పెద్ద లాభం. దాంతో స్ఫూర్తిపొందిన యూవీ ఇప్పుడు మారుతికి మరో చిన్న ప్రాజెక్టుని అప్పగించింది. సంతోష్ శోభన్ - మెహరీన్ జంటగా ఈ చిత్రాన్ని మారుతి, తన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిస్తున్నాడు. మూడ్రోజుల క్రితమే షూటింగ్ మొదలైంది. ఈ నెలాఖరుకి షూటింగ్ పూర్తయిపోతుంది.
ఈ సినిమానీ రెండంటే రెండు కోట్లతో తీయబోతున్నార్ట. ఆ తరవాత ఆహాకి అమ్మేస్తారు. లాభాల్లో మారుతికి వాటా అందుతుంది. అదీ.. ఈ సినిమా స్ట్రాటజీ. నెల రోజుల్లో సినిమాని పూర్తి చేయడం, అది కూడా.. లాక్ డౌన్ నిబంధనల్ని పాటిస్తూ తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో మారుతి స్పీడే స్పీడు.