పక్కా కమర్షియల్ చేతిలో ఉండగానే ప్రభాస్ సినిమాని ఓకే చేయించుకొన్నాడు మారుతి. చిరంజీవి ప్రాజెక్ట్ కీ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకొన్నాడు. ఓ వైపు ప్రభాస్, మరో వైపు చిరంజీవి.. ఇలా మారుతి లైనప్ బాగానే ఉందనుకొన్నారంతా. కానీ.. పక్కా కమర్షియల్ సినిమా విడుదలై, అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో.. ప్రభాస్, చిరు సినిమాలు డైలామాలో పడినట్టు అయ్యింది. ప్రభాస్ ఇప్పటికీ మారుతిపై నమ్మకం ఉంచాడని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ కాంబినేషన్ ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. చిరు మాత్రం కాస్త డౌటులో ఉన్నాడని తెలుస్తోంది.
అయితే మారుతి మాత్రం.. ఇప్పుడు గేమ్ ప్లాన్ మార్చుకొన్నట్టు సమాచారం. ప్రభాస్, చిరు సినిమాలకంటే ముందు మరో సినిమా తీసి, తానేంటో నిరూపించుకొన్న తరవాత స్టార్ సినిమాలకు దర్శకత్వం వహించాలని భావిస్తున్నాడట. ప్రభాస్ డేట్లు ఇవ్వడానికి ఇంకొంచెం సమయం ఉంది. ఈలోగా... ఓ సినిమా చేయాలన్నది మారుతి ప్లాన్. అందుకే సాయిధరమ్ తేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఓ కథ రెడీ చేశాడని చెబుతున్నారు. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రతిరోజూ పండగే వచ్చింది. అది సూపర్ హిట్టయ్యింది. అందుకే తేజ్ తో సినిమా చేసి, హిట్టు కొట్టి, అప్పుడు ప్రభాస్ సినిమాని గ్రాండ్ గా మొదలెట్టాలని భావిస్తున్నాడు. ఐడియా బాగానే ఉంది. కానీ.. సాయిధరమ్ తేజ్ సినిమా కూడా సరిగా ఆడకపోతే, అప్పుడు మొదటికే మోసం వస్తుంది. మరి మారుతి ఆలోచనలు, అదృష్టం ఎలా ఉన్నాయో.?