చిరంజీవి అంటే.. రవితేజకు వల్లమాలిన అభిమానం. చిరుని స్ఫూర్తిగా తీసుకొనే రవితేజ సినిమాల్లోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పాడు. అన్నయ్యలో చిరంజీవితో పాటు నటించాడు రవితేజ. శంకర్ దాదా జిందాబాద్ లో ఓ పాటలో కనిపించి, తన అభిమానాన్ని చాటుకొన్నాడు. ఇప్పుడు `వాల్తేరు వీరయ్య`లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రవితేజ - చిరంజీవిలను పక్క పక్కన చూస్తే అభిమానులకు పండగే.
అయితే ఈ సినిమా గురించిన ఓ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నుంచి రవితేజ తప్పుకొన్నాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. పారితోషికం విషయంలో రవితేజకు, నిర్మాతలకూ సరిపడక ఈ ప్రాజెక్టు నుంచి రవితేజ బయటకు వెళ్లిపోయాడని, ఆ స్థానంలో మరో హీరో కోసం అన్వేషిస్తున్నారని చెప్పుకొంటున్నారు.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని తేలింది. తన సినిమాలో నటించమని స్వయంగా చిరంజీవి రవితేజని కోరినట్టు సమాచారం. అలాంటప్పుడు రవితేజ పారితోషికం గురించి ఎందుకు ఆలోచిస్తాడు? మైత్రీ మూవీస్ కూడా ఖర్చు కు ఎక్కడా వెనుకంజ వేయదు. సో.. పారితోషికం గొడవ లేనట్టే. వచ్చే నెలలో `వాల్తేరు వీరయ్య` కొత్త షెడ్యూల్ మొదలు కానుందని, ఈ దఫా షూటింగ్ లో రవితేజ కూడా పాలు పంచుకోబోతున్నాడని తెలుస్తోంది. సో.. ఆ వార్తలో నిజం లేదన్నమాట.