తెలుగులో సంక్రాంతి హంగామా `క్రాక్` సినిమాతో మొదలైపోయింది. తమిళ నాట మాత్రం `మాస్టర్`తో షురూ కాబోతోంది. విజయ్ నటించిన ఈ చిత్రంపై తమిళనాట చాలా అంచనాలున్నాయి. `ఖైదీ`తో ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం... మరింత ఆకర్షణ పెంచింది. ఈసినిమా తమిళనాట కొత్త రికార్డులు సృష్టిస్తుందని విజయ్ అభిమానులు గంపెడాశలతో ఉన్నారు. అయితే ఈ సినిమాకి ఇప్పుడు గట్టి స్ట్రోక్ తగిలింది.
`మాస్టర్`లోని కొన్ని సన్నివేశాలు లీకైపోయాయి. తమిళనాట అంతా అవే చక్కర్లు కొడుతున్నాయి. సినిమా మొత్తం లీకైందా, అందులో కొన్ని సన్నివేశాలే బయటకు వచ్చాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళనాట పైరసీ బెడద ఎక్కువ. సినిమా విడుదలకాకముందే... అక్కడ పైరసీ సీడీలు ప్రత్యక్షం అవుతాయి. `మీ సినిమా పైరసీ చేయకుండా ఉండాలంటే ఇంత మొత్తం ఇవ్వాల్సిందే` అంటూ అక్కడ డైరెక్టుగా వార్నింగులు కూడా ఇస్తారు. ఈ నేపథ్యంలో `మాస్టర్` టీమ్ కి కంటి మీద కునుకు లేకుండా పోయింది. దర్శకుడు కనగరాజ్ కూడా ఓ ట్వీట్ చేశారు. లీకైన సన్నివేశాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్వర్డ్ చేయొద్దని ఆయన అభిమానుల్ని కోరారు.