గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుందట. అలా కథ కథపై.. ఓ హీరో పేరు తప్పకుండా రాసి ఉంటుంది. ఓ హీరో కోసం కథ రాసి, మరో హీరోకి చెప్పి, చివరికి ఇంకో హీరోకి నచ్చి ఓకే చేయడం లాంటి సీన్లు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఎన్టీఆర్ - రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. `అయిననూ పోయిరావలె హస్తినకు` అనే టైటిల్ పరిశీలనలో వుంది.
నిజానికి దీని కంటే ముందు ఎన్టీఆర్‌కి ఓ కథ వినిపించాడట త్రివిక్రమ్. అది.. బాగానే ఉన్నా `ఇప్పుడు మనం ఫ్యామిలీ జోనర్‌లో సినిమా చేద్దాం` అని చెప్పడంతో ఆ కథ పక్కన పెట్టి, మరో కథ రాశాడు. అదే.. `అయిననూ... పోయిరావలె`. ఇప్పడు ఎన్టీఆర్ కోసం రాసిన కథని.. రామ్ చరణ్ తో చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. చరణ్ తో ఓ సినిమా చేయాలని త్రివిక్రమ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. చరణ్ కూడా ఆ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నాడు. ఈ కథ గనుక.. చరణ్‌కి సెట్టయితే.. అతి త్వరలోనే ఈ కాంబోని చూడొచ్చు.