నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్యలక్ష్మి
దర్శకుడు : చెల్లా అయ్యావు
నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్
సంగీత దర్శకులు: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్
ఎడిటర్: ప్రసన్న జికె
రేటింగ్: 2.75/5
మంచి కంటెంట్ వున్న కథలతో గుర్తింపు తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. ఆయన 'రాక్షసన్' చిత్రం తెలుగు రీమేక్ లో కూడా మంచి విజయం సాధించింది. 'ఎఫ్ఐఆర్ ' మూవీ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు 'మట్టి కుస్తీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు రవితేజ నిర్మాత కావడం మరో విశేషం. ట్రైలర్, ప్రమోషనల్ మెటిరియల్ సినిమాపై ఆసక్తిని పెంచింది. భార్య భర్తల కథకు స్పోర్ట్స్ డ్రామా నేపధ్యం జోడించి తీసిన 'మట్టి కుస్తీ' ఎలా వుంది ? ఈ కుస్తీలో గెలిచింది ఎవరు ?
కథ:
వీర (విష్ణు విశాల్) తల్లి తండ్రులుని చిన్నప్పుడే కోల్పోతాడు. మామయ్య (కరుణాస్) సంరక్షణలో పెరుగుతాడు. తండ్రీతాతలు సంపాదించిన ఆస్తిని జల్సా చేస్తూ తిరగడం.. ఊర్లో పంచాయితీలు చేయడం.. ఫ్రెండ్స్‌తో కలిసి కబడ్డీ ఆడటం.. ఇదే అతడి జీవనశైలి. ఇక వీరాకి తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విషయంలో కొన్ని కండీషన్లు వుంటాయి.
తనకంటే తక్కువ చదువుకోవాలని.. ఆమెకు పొడుగు జడ ఉండాలనే రూల్స్ పెట్టుకుంటాడు. కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ)ది కేరళలోని పాలక్కడ్. బీఎస్సీ వరకు చదువుకుంది. బాబాయ్ (మనీష్‌కాంత్) ప్రోత్సాహంతో రెజ్లర్‌గా మారుతుంది. అయితే అబ్బాయిలా కటింగ్ చేసుకొని.. కుస్తీలు పట్టే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అయితే కీర్తి బాబాయ్ ఆమె చదువు కోలేదని, పొడుగు జడ ఉందని రెండు అబద్దాలు చెప్పి వీరాతో పెళ్లి జరిపిస్తాడు. ఈ పెళ్లి తర్వాత వారి మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి ? ఇద్దరూ కలిసున్నారా ? లేదా ? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
టైటిల్ చూసి ఇది స్పోర్ట్స్ డ్రామా అనుకుంటే పొరపాటే. ఇది ఓ భార్యభర్తల కథ. .. భార్యాభర్తల ఆధిపత్య పోరు. ఒక విధంగా భార్యభర్తల కుస్తీ అనొచ్చు. లీడ్ పెయిర్ పరిచయం.. పెళ్లి చూపుల, అబద్ధాలు ఆడి పెళ్లి చేసేయడం… ఇవన్నీ ఫన్ ని పంచాయి. పెళ్లి తర్వాత భార్య ముందు వీర ఫోజు కొట్టే సీన్స్, తన సవరాన్ని జడ అని నమ్మించడానికి కీర్తి పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ కి ముందు ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో కీర్తిలో అసలు కోణం బయట పడటం.. అది చూసి వీరా షాక్ అవ్వడం.. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది.
సెకండ్ హాఫ్ ని కూడా వినోదాత్మకంగానే డీల్ చేశాడు దర్శకుడు. అయితే భార్యా భర్తల మధ్య ఆధిపత్య పోరు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా రొటీన్. భార్యపై గెలిచి పైచేయి సాధించేందుకు వీరా మట్టికుస్తీ పోటీలో తలపడాలనుకోవడం.. 15రోజుల్లోనే ఆ ఆట నేర్చుకొని బరిలో దిగడం కాస్త రొటీన్ సినిమామాటిక్ గా ఫీలింగ్ ని ఇస్తాయి. అయితే చివర్లో ఇచ్చిన సందేశం మాత్రం ఆకట్టుకునేలా వుంటుంది.
నటీనటులు :
విశాల్ కథలపై తన అభిరుచికి మెచ్చుకోవాలి. ఇందులో హీరో కంటే హీరోయినిజం ఎక్కువ. స్వయంగా తానే నిర్మాత అయ్యిండి ఇలాంటి కథని తీసుకోవడం అభినందనీయం. వీర పాత్రకు విశాల్ న్యాయం చేశాడు.
ఐశ్వర్య లక్ష్మీకి మంచి పాత్ర పడింది. ఆమె పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. హీరో మామయ్య, హీరోయిన్ బాబాయ్ పాత్రలు వినోదం పంచాయి. అజయ్, శత్రు పాత్రలు పరిధి మేరకు వున్నాయి.
టెక్నికల్ :
నిర్మాణ విలువలు బావున్నాయి. పాటలు నేపధ్య సంగీతం కథకు తగ్గట్టుగా వున్నాయి. చల్ చిక్కని చిలుక పాటని కలర్ ఫుల్ గా తీశారు. కెమరాపని తనం డీసెంట్ గా వుంది.
ఫస్ట్ హాఫ్ ని ఎడిటర్ కాస్త షార్ఫ్ చేయాల్సింది. దర్శకుడు చెల్లా అయ్యావు ఈగో నేపధ్యంలో భార్యభర్తల కథ తీసుకొని ప్రేక్షకుడికి కాలక్షేపం అయిపోయే అనుభూతిని అయితే ఇవ్వగలిగాడు.
ప్లస్ పాయింట్స్
ఐశ్వర్య లక్ష్మీ, విష్ణు విశాల్
వినోదం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
రొటీన్ కథనం
మలుపులు లేకపోవడం
అక్కడక్కడ సాగదీత
ఫైనల్ వర్డిక్ట్ : 'ఈగో' కుస్తి!