ఈ ఎన్నికలలో గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా - బండ్ల గణేష్ మాత్రం మంచి కామెడీ ఫిగర్ అయిపోయాడు. `మహా కూటమి అధికారంలోకి రాకపోతే నేను 7 ఓ క్లాక్బ్లేడుతో గొంతు కోసుకుంటా` అని ఏ ముహూర్తాన అన్నాడో గానీ - ఆ ముక్కే ఇప్పుడు బండ్ల గణేష్ని పట్టి పీడిస్తున్నది. `బండ్లకు బ్లేడు దొరికిందా లేదా` అంటూ గణేష్పై సోషల్ మీడియాలో సెటైర్లు ఎక్కువయ్యాయి. ఎలక్ట్రానికి మీడియా అయితే ఓ అడుగు ముందుకేసింది. ఎన్నికలకు ముందు `నేను గొంతు కోసుకుంటా` అంటూ బండ్ల ఇంటర్వ్యూ ఇచ్చిన యూ ట్యూబ్ ఛానల్ ఇప్పుడు బండ్ల గణేష్ ఇంటి ముందే పడిగాపులు కాస్తోంది.. చేతిలో ఓ 7 ఓ క్లాకు బ్లేడు పట్టుకుని రెడీ అయిపోయారు.
ఇంటి ముందు నుంచి.. బండ్ల కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్టు చేయడం లేదట బండ్ల గణేష్ ఉత్తమ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లాడని తెలిసి... కెమెరా, చేతిలో బ్లేడు పట్టుకుని అక్కడికీ వెళ్లిపోయారు ఛానల్ వాళ్లు. కానీ బండ్ల గణేష్ మాత్రం ఎవరికీ దొరకడం లేదు. బండ్ల గణేష్ మంచి మాటకారి. మీడియాకు ఎదురైనా... ఏదోలా తన మాటలతో బురిడీ కొట్టించగలడు. ``కేసీఆర్ కూడా ఇది వరకు ఇలాంటి ఒట్లు చాలా వేశాడు. ముందు వాటిని నెరవేర్చమనండి..`` అన్నా అంటాడు. బండ్ల ఏదైనా చెప్పగలడు, చేయగలడు. కానీ ముందు మీడియాకు దొరకాలిగా.