తెలంగాణలో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. నువ్వా? నేనా? అన్నట్టు సాగిన ఎన్నికల పోరులో.. కేసీఆర్ దళం కనీ వినీ ఎరుగని రీతిలో విజయఢంకా మోగించింది. కేసీఆర్ విజయంతో చిత్రసీమలోనూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల సమయంలో చిత్రసీమ కాస్త గుంభనంగానే ఉంది. చిత్రసీమ సపోర్ట్ కేసీఆర్ కా? లేదంటే.. మహా కూటమికా అన్న విషయం తెలియలేదు. అప్పటి వరకూ కేసీఆర్, కేటీఆర్ నామ జపం చేసిన స్టార్లు సైతం.... నిశ్శబ్దంగా ఉండడంతో ఈసారి ఫిల్మ్ నగర్ మొత్తం పార్టీ మార్చేసిందేమో అనుకున్నారు. కానీ పరోక్షంగా మాత్రం టాలీవుడ్ టీ ఆర్ ఎస్‌కి వెన్నుదన్నుగా నిలిచిందని అర్థమవుతోంది.
నాగబాబులాంటి వాళ్లు ముందు నుంచీ టీ. ఆర్.ఎస్‌కి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మాగంటి రవీంద్రనాథ్‌కి దాదాపు 30 శాతం ఓట్లు పోలయ్యాయి. జూబ్లీహిల్స్ లో ఎక్కువగా ఉండేది సినీ సెలబ్రెటీలే. అంటే.. వాళ్ల ఓట్లన్నీ.. టీఆర్.ఎస్‌కి పడినట్టే అనుకోవాలి. టీ.ఆర్.ఎస్ వైపు గాలి మొదలవ్వగానే.. ట్విట్టర్లనోనూ, ఫేస్ బుక్‌లోనూ.. సినిమా వాళ్లంతా బాగా హడావుడి చేయడం కనిపించింది. కేసీఆర్, కేటీఆర్‌లను పొగుడుతూ ట్వీట్లు చేశారు. సినీ పరిశ్రమ తరపున `మా` కూడా ఓ ప్రెస్ మీట్ నిర్వహించి, కేసీఆర్ బృందానికి శుభాకాంక్షలు తెలియజేసింది.
ఎన్నికల ముందు... మహాకూటమా? టీ.ఆర్ ఎస్సా? అనే మీమాంశ ఉండేది. అలాంటి సమయంలో కూడా చిత్రసీమ స్థిరంగా ఉందనే చెప్పొచ్చు. కేసీఆర్‌కి నేరుగా తమ మద్దతు తెలియజేయకపోవొచ్చు గానీ... పరోక్షంగా మాత్రం.. వెన్నుదన్నుగానే నిలిచింది. ఆ విధంగా ఈ విజయంలో టాలీవుడ్‌కీ భాగం ఉన్నట్టే.