'థిల్లానా థిల్లానా.. నా కసి కళ్ల కూనా..' అంటూ సూపర్ స్టార్ సరసన 'ముత్తు' సినిమాలో రొమాంటిక్ స్టెప్పులేసిన మీనా ఇప్పుడు విలన్‌గా మారిపోనున్నారు. మీనా అంటే క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నిండైన అందం గుర్తుకొస్తాయి. అలాంటిది మీనాలో నెగిటివ్ ఛాయలు చూపించడానికి రెడీ అయిపోయారు తమిళ ప్రముఖ దర్శకుడు శివ. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న 'తలైవర్ 168'లో మీనా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ - మీనా కాంబినేషన్లో చివరి సారిగా తెరకెక్కిన చిత్రం 'ముత్తు'. దాదాపు 24 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మీనా, సూపర్ స్టార్‌తో జత కడుతున్నారు. అయితే, ఈ సారి సూపర్ స్టార్ సరసన హీరోయిన్గా కాదు, విలక్షణ పాత్రలో కనిపించనున్నారు.
ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సూపర్ స్టార్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందంటూ, మీనా సోషల్ మీడియాలో స్పందించారు. ఈ మధ్యనే మీనా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వెంకటేష్‌తో 'దృశ్యం' సినిమాలో నటించారు. మోహన్‌బాబు సరసన 'మామ మంచు అల్లుడు కంచు' తదితర చిత్రాల్లోనూ మీనా కనిపించారు. కానీ, మీనా కెరీర్లోనే విలక్షణ పాత్ర పోషించనున్నారు తాజా చిత్రంతో. చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతోందట మీనా రోల్ ఈ సినిమాలో. చూడాలి మరి, చందమామలాంటి అందంతో ప్రతి నాయిక ఛాయలున్న పాత్రలో మీనా ఎలా మెప్పిస్తుందో.!