అక్కినేని కోడలు సమంత సినిమాల నుండి కాస్త గ్యాప్ కోరుకుంటోందట. వరుస సినిమాలు, వరుస సక్సెస్‌లతో హుషారు మీదున్న సమంత, ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులపై అంతగా ఆసక్తి చూపడం లేదు. పెళ్లి తర్వాత విభిన్న చిత్రాల్లో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న అందాల భామ సమంతకు వద్దన్నా మరిన్ని మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయట. కానీ, వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తోందట. దక్షిణాది నుండే కాదు, ఉత్తరాది అవకాశాలు కూడా సమంత తలుపు తడుతున్నాయట. కానీ, సమంత ఎంత మాత్రమూ కాంప్రమైజ్ కావట్లేదనీ అంటున్నారు.
ఆమె నటించిన '96' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే, తాజాగా బాలీవుడ్ నుండి ఓ బెస్ట్ ఆఫర్ సమంత వద్దకు వచ్చిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. కన్నడలో సూపర్ హిట్ అయ్యి, తెలుగులోనూ సమంత ప్రధాన పాత్రలో రీమేక్ చేయబడి మంచి విజయం అందుకున్న 'యూ టర్న్' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ రీమేక్‌లో సమంత అయితే బాగుంటుందని బాలీవుడ్ నిర్మాతలు సమంతతో మంతనాలు చేస్తున్నారట. కానీ, సమంత మాత్రం అందుకు ససేమిరా అంటోందనీ ఫిలిం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే, సమంత సినిమాల నుండి కాస్త బ్రేక్ కోరుకుంటోందనే తెలుస్తోంది. ప్రస్తుతం సమంత ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.