మెగా హీరోలకు ఇది బంగారు కాలం. ఔను... మొన్న అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకొంటే, నిన్న చిరంజీవి పద్మ విభూషణ్‌గా మన్ననలు అందుకొన్నాడు. ఇంతకంటే మెగా అభిమానులకు కావల్సిందేముంది? పుష్షతో అల్లు అర్జున్ ఖ్యాతి దేవ వ్యాప్తమైంది. బోనస్‌గా... ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకొన్న తొలి తెలుగు నటుడిగా కీర్తి ఘడించాడు. ఇప్పుడు చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది. ఇది వరకే చిరుకి పద్మభూషణ్ అందిన సంగతి తెలిసిందే. అంతేనా..?
ఆస్కార్ స్థాయిలో తెలుగు సినిమాకి వెలుగులు తీసుకొచ్చిన ఘనత రామ్ చరణ్ ది. `నాటు నాటు` పాటకు ఎన్టీఆర్ తో వేసిన స్టెప్పులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆస్కార్ వేదికపై తెలుగు పాట మార్మోగింది. అలా.. `ఆర్.ఆర్.ఆర్`తో రామ్ చరణ్ ఘనత ఆస్కార్ వేదిక వరకూ వెళ్లింది. మెగా హీరోల్లో సాయిధరమ్ తేజ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. `విరూపాక్ష`తో గతేడాది ఓ మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
వరుణ్ తేజ్ చేతిలోనూ మంచి సినిమాలున్నాయి. ఇలా ఎలా చూసినా.. మెగా హీరోలు, వాళ్ల అభిమానులు గర్వపడే సందర్భం ఇది. చిత్రసీమలో మెగా హీరోల ఆధిప్యతం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వాళ్లంతా ఫామ్ లో ఉండడం చిత్రసీమకే గర్వకారణం. అభిమానులకు ఆనందదాయకం.