ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 'దేవర` విడుదల కావాల్సివుంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడబోతోందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ఇప్పుడు అదే నిజమైంది. 'దేవర' వాయిదా పడింది. ఆ స్థానంలో విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీస్టార్' విడుదలకు రంగం సిద్ధమైంది. దిల్ రాజు టీమ్.. 'ఫ్యామిలీ స్టార్'ని ఏప్రిల్ 5న విడుదల చేయడానికి నిర్ణయం తీసుకొంది. అంటే... పరోక్షంగా 'దేవర' వాయిదా పడినట్టు సంకేతాలు ఇచ్చేసినట్టే.
అయితే ఈ విషయంలో 'దేవర' టీమ్ స్పందించాల్సివుంది. మార్చి 28న 'ఫ్యామిలీస్టార్' రావాల్సివుంది. అయితే 'దేవర' తప్పుకోవడంతో ఏప్రిల్ 5.. ఫిక్స్ చేసుకొంది. `ఫ్యామిలీస్టార్` ఓ వారం ఆలస్యంగా వస్తుండడంతో, ఆ డేట్ ని... `టిల్లు స్వ్కేర్` కేవసం చేసుకొంది. మార్చి 29న టిల్లు 2ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. 'దేవర'ని ఈ వేసవిలోనే విడుదల చేయాలన్నది నిర్మాతల అభిమతం. ఏప్రిల్ లో వీలుకాకపోయినా మే - జూన్‌లలో అయినా విడుదల చేస్తే బాగుంటుందన్నది అభిమానుల ఆశ. సైఫ్ అలీఖాన్ గాయం నుంచి ఎప్పుడు కోలుకొంటాడో, ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో ఇంకా చిత్రబృందానికి స్పష్టత రావాల్సివుంది. అప్పటి వరకూ 'దేవర' విడుదల తేదీపై క్లారిటీ రాదు.