దేవీశ్రీ ప్రసాద్... టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరక్టర్. తన ఆల్బమ్ లో ఆరు పాటలుంటే ఆరూ హిట్టే. అందులో ఐటెమ్ పాట ఉంటే... అదే చాట్ బస్టర్ అవుతుంది. పెద్ద హీరో, చిన్న సినిమా అని చూడకుండా దుమ్ము దులిపే పాటలివ్వడం దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేకత. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రతిభ మెల్లమెల్లగా మసకబారుతోంది. అప్పుడప్పుడూ.. పేలమైన ట్యూన్లు, రిపీటెడ్ ట్యూన్లతో విసుగు తెప్పిస్తున్నాడు. ట్రోలర్స్‌కి అడ్డంగా దొరికిపోతున్నాడు.
తాజాగా `వాల్తేరు వీరయ్య` కోసం బాస్ పార్టీ అనే పాట ఇచ్చాడు దేవిశ్రీ. చిరంజీవి సినిమా, అందులోనూ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అటుపై ఐటెమ్ సాంగ్ అనగానే భారీ అంచనాలు వేసుకొన్నారు అభిమానులు. తీరా చూస్తే... ఐటెమ్ గీతం చప్పగా సాగిపోయింది. ఇందులో ఎలాంటి మెరుపుల్లేవు. పైగా ఈ పాట రాసింది స్వయంగా దేవిశ్రీ ప్రసాదే. దానికి తోడు.. దేవిశ్రీ ప్రసాద్ `సాకీ` చెత్తగా ఉందన్నది సినీ విశ్లేషకుల మాట. చిరంజీవి లాంటి స్టార్ ఉన్నప్పుడు, ఇలాంటి పాట ఇస్తాడా? అంటూ మెగా అభిమానులు దేవిశ్రీ పై ఫైర్ అవుతున్నారు. అసలు ఈ పాటని చిరు ఎలా ఓకే చేశాడన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. దేవిశ్రీ ప్రసాద్ కి కాంపిటేషన్ గట్టిగా ఉంది. తమన్ ఓ వైపు విజృంభిస్తున్నాడు. దేవికి రావాల్సిన అవకాశాలు లాక్కెళ్లిపోతున్నాడు. ఇలాంటి దశలో ఇలాంటి ఐటెమ్ గీతాలు ఇవ్వడం వల్ల దేవిశ్రీ ఇమేజ్ పూర్తిగా డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. వాల్తేరు వీరయ్య నుంచి.. ఇలాంటి పాట రావడం.... నిజంగా ఆ సినిమా మైలేజీని పూర్తిగా తగ్గించేస్తుందన్నది విశ్లేషకుల మాట.