చిరంజీవి అంటేనే మాస్.. మాస్ అంటేనే చిరంజీవి. చిరుకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చినవే మాస్ సినిమాలు. ఖైదీ నెంబర్ 150లో చిరు మాస్‌గా కనిపించాడు. అందుకే ఆ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు మరోసారి... చిరుని పూర్తి మాస్ పాత్రలో చూడబోతున్నాం. బాబి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి `వాల్తేరు శ్రీను` అనే పేరు పరిశీలిస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నోట్లో బీడీ, చేతిలో లైటర్ తో చిరు యమ మాస్ గా ఉన్నాడు. `అరాచకం ఆరంభం` అంటూ.. పోస్టర్ లోనే సినిమా ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇందులో చిరు ఓ జాలరిగా కనిపించబోతున్నాడని సమాచారం. చిరుతో పాటు మరో కథానాయకుడూ ఈ సినిమాలో నటించబోతున్నాడని, ఆ కథానాయకుడి పేరుని త్వరలో ప్రకటిస్తారని సమాచారం. త్వరలోనే సినిమా టైటిల్ ని కూడా అధికారికంగా రివీల్ చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే... చిరు లుక్స్ తో అభిమానుల్లో పూనకాలు మొదలైపోయినట్టే.