నటీనటులు : ఆనంద్ దేవేరుకోండ, వర్ష, తరుణ్ భాస్కర్ తదితరులు
దర్శకత్వం : వినోద్ ఆనంతోజు
నిర్మాతలు : వ్ ఆనంద ప్రసాద్
సంగీతం : స్వీకర్ అగస్తి, ఆర్ హెచ్ విక్రమ్
సినిమాటోగ్రఫర్ : సన్నీ కూరపాటి
ఎడిటర్: రవితేజ గిరజాల
రేటింగ్: 2.5/5
మధ్యతరగతి జీవితాలే కాదు. వాళ్ల కలలు కూడా ఎప్పుడూ హద్దుల్లోనే ఉంటాయి. టాటాలూ బిర్లాలూ అయిపోవాలని ఉండదు. ఉన్నంతలో కాస్త బాగా బతకాలని ఉంటుంది. నచ్చిన వాళ్లని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. చిన్న చిన్న కోరికల్ని తీర్చుకోవాలని ఉంటుంది. `మిడిల్ క్లాస్ మెలొడీస్`లోనూ అలాంటి చిన్న చిన్న కలలు, కోరికలు.. వాటిని తీర్చుకోవడానికి పడే కష్టాలూ కనిపిస్తాయి. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అమేజాన్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ఉన్న మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలాంటిది?
* కథ
రాఘవ (ఆనంద్ దేవరకొండ) ఇంటర్ పూర్తి చేశాడు. వాళ్లది మిడిల్‌క్లాస్. నాన్న కొండలరావు (గోపరాజు రమణ)ది ఊర్లో చిన్న కాఫీ హోటెల్. ఆ హోటెల్ లో నాన్నకు సహాయం చేస్తుంటాడు. కానీ ఎప్పటికైనా పక్కన ఉన్న గుంటూరు వెళ్లి అక్కడ హోటెల్ పెట్టాలన్నది రాఘవ కోరిక. మరి ఆ కోరిక తీరిందా? లేదా? హోటెల్ పెట్టే ప్రయాణంలో రాఘవకు ఎదురైన అనుభవాలేంటి? మరదలు సంధ్య (వర్ష బొల్లమ్మ)తో ప్రేమ కథ ఎలా మొదలైంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే `మిడిల్ క్లాస్ మెలొడీస్` చూడాలి.
* విశ్లేషణ
మిడిల్ క్లాస్ జీవితాల్లో కావల్సినంత సంఘర్షణ ఉంటుంది. దాన్నే కథగా మలచుకున్నాడు దర్శకుడు. కొన్ని మధ్య తరగతి జీవితాలు, ఆ కుటుంబాల్లో సాగే గొడవలు, వాళ్ల ఆశలు, కోరికలు.. వీటన్నింటికీ దృశ్య రూపం ఇవ్వాలని చూశాడు. కథ ప్రారంభంలో తండ్రీ కొడుకుల మధ్య వైరం, తండ్రి కొడుకుని ఆడిపోసుకోవడం ఇవన్నీచూస్తే.. నిత్యం మన ఇళ్లలో జరిగే కథలానే అనిపిస్తుంది. రాఘవ - సంధ్యల ప్రేమకథలోనూ.. క్యూట్ నెస్ ఆకట్టుకుంటుంది. గుంటూరులో రాఘవ హోటెల్ పెట్టే ప్రయత్నాలు, అందుకు ఆటంకాలు రావడం.. ఇలా.. ప్రధమార్థం సాగిపోతుంది. ద్వితీయార్థం అంతా హోటెల్ గొడవే. తన బొంబాయి చెట్నీ రుచి చూపించి, గుంటూరులో పాగా వేయాలని కలలు కనే రాఘవ అందుకోసం ఏం చేశాడన్నది చూపించారు. అయితే ఆయా సన్నివేశాలేం ఆసక్తిగా సాగవు. స్ఫూర్తి కూడా కలిగించవు. పైగా ఈ సినిమాలో\ వినోదానికి అంత స్కోప్ లేదు. ఉన్నా దర్శకుడు వాడుకోలేదు. ఎప్పుడూ.. వాళ్ల బాధలు, గొడవలే. సంధ్య - రాఘవ మధ్య లవ్ ట్రాక్ ని సైతం దర్శకుడు సరిగా రాసుకోలేదు. వీళ్లతో పోలిస్తే... హీరో స్నేహితుడు గోపాల్ ప్రేమకథలోనే కాస్త పెయిన్ కనిపిస్తుంది.
సన్నివేశాల్లో అనవసరమైన సాగదీత.. ఇబ్బంది పెడుతుంది. కథ ముందుకు కదలదు. అలాగని సన్నివేశమూ కొత్తగా, ఆసక్తిగా అనిపించదు. చివర్లో... తరుణ్ భాస్కర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన రాకతో కథేమైనా మలుపు తిరుగుతుందేమో అనుకుంటారంతా. కానీ..ఆ పాత్రనీ సరిగా వాడుకోలేదు. ప్రేమ, మధ్య తరగతి బాధలు, ఆ ఇంటి నుంచి వచ్చే కుర్రాళ్ల కలలూ.. వీటిని సరిగా మిక్స్ చేయగలిగితే.. కచ్చితంగా `మిడిల్ క్లాస్ మెలొడీస్` మంచి కథే అయ్యేది. కానీ... కథనంలో బలం లేకపోవడంతో తేలిపోయింది.
* నటీనటులు
ఆనంద్ దేవరకొండకు ఇది రెండో సినిమా. తొలి సినిమాకీ, రెండో సినిమాకీ నటనలో పెద్దగా మార్పు కనిపించలేదు. వీలైనంత వరకూ సహజంగా నటించడానికి ప్రయత్నించాడు. అందుకే కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెషన్ ఏమీ ఇవ్వలేకపోయినా, చెల్లుబాటు అయ్యింది. వర్ష బొల్లమ్మ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇంట్రవెల్ ముందు సన్నివేశంలో తన ఫస్ట్రేషన్ బాగుంది. కథానాయకుడి తండ్రి పాత్రలో రమణ సైతం సహజమైన రీతిలో చేసుకుంటూ వెళ్లారు. నటీనటులంతా.. అంతే. కాబట్టి సన్నివేశాల్లో బలం లేకపోయినా, వాళ్ల నటనతో నిలబెట్టగలిగారు.
* సాంకేతిక వర్గం
పాటలు బాగున్నాయి. ముఖ్యంగా.. గుంటూరే పాట నచ్చుతుంది. నేపథ్య సంగీతం ఓకే. మాటలు సహజంగా ఉన్నాయి. డ్రమటిక్ డైలాగులు లేకుండా జాగ్రత్త పడ్డారు. కథలో కొత్తదనం లేదు. కథనం సహజంగా ఉన్నా, అందులో ఆకట్టుకునే ఎలిమెంట్స్, తరవాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠత లేవు.
* ప్లస్ పాయింట్స్
సహజమైన నటన
సహజమైన సన్నివేశాలు
గుంటూరే పాట
* మైనస్ పాయింట్స్
కథనం
సాగదీత
* ఫైనల్ వర్డిక్ట్: బొంబాయి చెట్నీ రుచించలేదు