ఓటీటీ దయ వల్ల కరోనా కాలంలో సినిమాకి దూరమయ్యామన్న బాధ... సినీ అభిమానులకు కొంత వరకూ తగ్గింది. ప్రతీ వారం... ఏదో ఓ ఓటీటీ వేదికపై కొత్త సినిమా ఆడేస్తోంది. ఒక్కోసారి రెండు మూడు సినిమాలు కూడా వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలూ ఓటీటీ బాట పట్టడంతో, సినీ అభిమానులకు కావల్సినం ఊరట లభిస్తోంది. మరో వైపు నిర్మాతలకు సైతం ఓ చక్కటి ప్రత్యామ్నాయంగా మారింది.
అయితే.. ఈ లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో ఎన్ని సినిమాలొచ్చినా, అందులో కొన్నింటికి మాత్రమే ప్రేక్షకుల ఆదరణ దక్కింది. భారీ రేట్లు పెట్టి కొనుక్కొన్న పెద్ద సినిమాలు దారుణంగా బోల్తా పడ్డాయి. దాంతో... ఓటీటీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. కొత్త సినిమాల వల్ల సబ్ స్క్రైబర్లు పెరగడం అటుంచితే.. ఓటీటీ సంస్థల రెప్యుటేషనే ప్రమాదంలో పడిపోయింది.
దాంతో ఓటీటీ సంస్థలన్నీ ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చిన్నా, పెద్దా.. సినిమా ఏదైనా సరే, ఓటీటీ ప్రతినిధులకు ముందుగా చూపించాలట. సినిమా చూశాక, నచ్చితేనే సినిమా కొంటారట. ఇది వరకు సినిమా చూపించాలన్న తప్పనిసరి నిబంధన ఏమీ లేదు. ట్రైలర్, ఆ కాంబినేషన్‌పై క్రేజ్ చూసి ఓటీటీ సంస్థలు సినిమాల్ని కొనేసేవి. ఇప్పుడు మాత్రం ఈ నిబంధన తప్పని సరి చేయాలని చూస్తున్నారు. ఇది తప్పనిసరి అయితే.. నిర్మాతలు మరింత ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమాలు తీసుకోవాలి. కాంబినేషన్‌ని క్యాష్ చేసుకోవాలంటే, ఓటీటీకి సినిమాని అమ్ముకుని చేతులు దులుపుకోవాలంటే.. ఇక కుదరని పనే.