నటీనటులు: ఉదయ్‌శంకర్, ఐశ్వర్య రాజేష్, ప్రదీప్ రావత్, సంజయ్ స్వరూప్ తదితరులు.
దర్శకత్వం: ఎన్ వి నిర్మల్ కుమార్
నిర్మాతలు: జి శ్రీరామ రాజు, భారత్ రామ్
సంగీతం: గిఫ్టన్ ఎలియాస్
విడుదల తేదీ: డిసెంబర్ 6, 2019
రేటింగ్: 1.5/5
అబ్బాయి పొంగలి బ్యాచ్ .. అమ్మాయి దంగల్ బ్యాచ్..ఎలా మ్యాచ్ అవుతుంది? కానీ ఈ ఇద్దరి మధ్యే ప్రేమ మొగ్గలు తొడిగింది. సినిమాకి కావల్సింది కూడా ఇలాంటి కథే. వినోదం పండించడానైనా, డ్రామాకైనా ఇలాంటి కథలు మంచి అవకాశాన్నిస్తుంటాయి. ఈ సినిమా పేరు, ఈ కథా నేపథ్యం... విడుదలకి ముందే ఆసక్తి రేకెత్తించాయి. ప్రచార కార్యక్రమాలు కూడా ఒక రేంజ్‌లో జరిగాయి. మరి సినిమా ఎలా ఉంది?
* కథ
సిద్ధార్థ్ (ఉదయ్‌శంకర్) సాఫ్ట్‌వేర్ కుర్రాడు. బాగా తెలివైనోడు. మహాలక్ష్మి (ఐశ్వర్య రాజేష్) రెజ్లర్. కుస్తీ అనగానే బస్తీ మే సవాల్ అంటుంది. అలాంటి ఈ ఇద్దరూ అనుకోకుండా కలుసుకుంటారు. సిద్ధూ తెలివి తేటలు చూసి మహా ఇష్టపడుతుంది. అతనితో ప్రేమలో పడుతుంది. మొదట సిద్ధూ ఒప్పుకోకపోయినా ఆమె ప్రేమని కాదనలేకపోతాడు. కానీ వాళ్ల ప్రేమకు కుటుంబాల నుంచి సమస్యలొస్తాయి. భిన్న నేపథ్యాలున్న ఇరువురి కుటుంబాల అభిప్రాయాలు కలవకపోవడంతోపాటు , గొడవలు కూడా జరుగుతాయి. మరి ఈ ఇద్దరి ప్రేమ కథ సుఖాంతమైందా లేదా? రెజ్లర్‌గా ఐశ్వర్య తన కెరీర్‌ని కొనసాగించిందా లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
* నటీనటులు
ఉదయ్‌శంకర్ `ఆటగదరా శివ`లాంటి సినిమాలకే కరెక్ట్ అనిపిస్తుందీ చిత్రం. ఐశ్వర్య రాజేష్ తన పాత్రకి న్యాయం చేసింది. కానీ ఆమె కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సినిమా చెప్పకనే చెబుతుంది. ప్రదీప్ రావత్ కథానాయిక తండ్రిగా కనిపిస్తాడు. ఆయన పాత్ర పరిధి మేరకు నటించాడు. సంజయ్ స్వరూప్ హీరో తండ్రిగా కనిపిస్తాడు. మిగిలిన పాత్రలకిపెద్దగా ప్రాధాన్యం లేదు.
* సాంకేతిక వర్గం
సాంకేతికంగా సినిమా ఓకే. కెమెరా, సంగీతం పర్వాలేదనిపిస్తాయంతే. దర్శకుడు నిర్మల్‌కుమార్ తమిళంలో మంచి సినిమాలు తీశాడు. ఆయన శైలికి భిన్నమైన కథతో ఈ సినిమాని తీశాడేమో అనిపిస్తుంది. నిర్మాతలు కథకి తగ్గట్టుగా ఖర్చు పెట్టారు.
* విశ్లేషణ
కథగా చూస్తే ఒక లైన్‌లో తేల్చేయొచ్చన్నట్టుగా ఉన్నా... ఇందులో పలు పార్శ్వాలుంటాయి. ఇద్దరి ప్రేమ, క్రీడా నేపథ్యం, తండ్రి కలని భుజాన వేసుకున్న ఒక అమ్మాయి ప్రయాణం... ఇలా చాలా విషయాలకి ఈ కథలో చోటుంది. కానీ దర్శకుడు అన్ని విషయాల్నీ పైపైనే టచ్ చేస్తూ సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు. దాంతో సగమే ఉడికిన వంటలాగా తయారైంది. హీరోహీరోయిన్ల నేపథ్యాలు, వాళ్ల కుటుంబ వాతావరణాన్ని చూపించడం వరకు బాగానే ఉంది. కానీ వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొగ్గ తొడిగే సన్నివేశాల్లో మాత్రం బలం లేదు. ఒకట్రెండు మాటలతోనే హీరో వెంటపడి మరీ ప్రేమిస్తుంటుంది. రెండు కుటుంబాల మధ్య వచ్చే గొడవల్ని కూడా కథతో సరిగ్గా ముడిపెట్టలేకపోయాడు దర్శకుడు. రెజ్లింగ్ తన తండ్రి కల అనే విషయం హీరోయిన్‌కి తెలిసినా ఆమె నుంచి ఎలాంటి స్పందన ఉండదు.
నాయకానాయికల పాత్రల్ని తీర్చిదిద్దిన విధానంలో కూడా లోపాలు కనిపిస్తుంది. హీరోని పొంగలి బ్యాచ్ అన్నప్పుడు ఆ పాత్రని అలాగే చూపించాలి. హీరోయిన్ స్వతహాగా ఫైటర్ అయినా.. ఆమె మాత్రం పోటీల్లో తప్ప మరెక్కడా తన ఫైటింగ్ స్పిరిట్‌ని చూపించదు. పొంగలి బ్యాచ్ అయిన హీరో విలన్లని కొడుతుంటే అందరి హీరోయిన్లలాగా `వేయ్, కొట్టేయ్` అంటూ చప్పట్లు చరుస్తుంటుంది. కథానాయకుడు ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరో రేంజ్‌లో బిల్డప్ షాట్లతో రెచ్చిపోతుంటాడు. అలాంటి సన్నివేశాలతో ఆ పాత్ర అంతరార్థమే మారిపోయింది. ఇంటర్వెల్ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్ అంటూ హీరో చేసే హంగామా, ఆయన చేసే ఫైట్లు మరో ఎత్తు. అవి ఏ దశలోనూ ఆకట్టుకునేలా ఉండవు. `తొలిప్రేమ`లోని ఈ మనసే.. పాటని చిత్రీకరించిన విధానం, అందులో ఉదయ్‌శంకర్‌ని ఏమాత్రం చూడలేం. పతాక సన్నివేశాల్లో రెజ్లింగ్ పోటీలైతే మరీ దారుణంగా అనిపిస్తాయి. వాటిల్లో ఏమాత్రం ఆసక్తి ఉండదు.
* ప్లస్ పాయింట్స్
కెమెరా వర్క్
మ్యూజిక్
* మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
ఆకట్టుకోలేని కథనం
* ఫైనల్ వర్డిక్ట్: `మిస్ మ్యాచ్` హీరో హీరోయిన్‌కే కాదు... కథకీ, కథలోని పాత్రలకి కూడా!
- రివ్యూ రాసింది శ్రీ