నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సత్య, షకలక శంకర్, వెన్నెల కిషోర్, రఘుబాబు, డాలీ షా తదితరులు.
దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి
నిర్మాతలు: శ్రీనివాస్ రెడ్డి
సంగీతం: సాకేత్ కొమంధురి
విడుదల తేదీ: డిసెంబర్ 6, 2019
రేటింగ్: 1.5/5
ఈరోజుల్లో నవ్వుల కోసమే థియేటర్లకు వెళ్లేవాళ్లు తక్కువైపోయారు. ఎందుకంటే ఇంట్లో కుర్చుంటే.. జబర్‌దస్త్ ఉంది. సోషల్ మీడియా నిండా బోలెడన్ని జోకులు. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దొరుకుతుంది. ఇలాంటి సమయంలో - నవ్వించడానికి ఓ సినిమా తీసి, జనాలు టికెట్టు పెట్టుకుని మరీ సినిమా చూస్తే - థియేటర్లో ఇంకెన్ని నవ్వులుండాలి..?? ఆ స్క్రిప్టు ఇంకెంత గమ్మత్తుగా ఉండాలి...? `భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు` నుంచి కూడా జనాలు ఇవే ఆశించారు. మరి ఏమైంది..? టికెట్టు రేటుకి గిట్టుబాటయ్యే వినోదం థియేటర్లో దొరికిందా..? టైటిల్లో ఉన్న గమ్మత్తు... కథలో ఉందా..?
* కథ
శ్రీనివాస్ (శ్రీనివాసరెడ్డి) ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఓ మంచి హీరోయిన్‌ని పట్టుకుని ఓ షార్ట్ ఫిల్మ్ తీసి పేరు తెచ్చుకోవాలని చూస్తాడు. తనకు లాటరీలు కొనడం అలవాటు. ఓరోజు లాటరీకి రూ2 కోట్లు తగులుతాయి. అయితే ఆ లాటరీ టికెట్టు ఎక్కడో పడిపోతుంది. పడిపోయిన లాటరీ టికెట్టు కోసం అన్వేషణ మొదలవుతుంది. మరోవైపు తనకు కావల్సిన హీరోయిన్ దొరుకుతుంది. అయితే ఆ హీరోయిన్‌కి మతి స్థిమితం ఉండదు. ఇదంతా ఒక ఎత్తయితే , మరోవైపు నగరంలో డ్రగ్స్ మాఫియా తిరుగుతుంటుంది. వాళ్లని ఎలాగైనా పట్టుకుంటానని పోలీస్ కమీషనర్ (వెన్నెల కిషోర్) శపథం చేస్తాడు. మరి డ్రగ్స్ మాఫియా పోలీసులకు చిక్కిందా? శ్రీనివాస్‌కి హీరోయిన్‌తో పాటు, లాటరీ టికెట్టు దక్కిందా? అనేదే మిగిలిన కథ.
* నటీనటులు
శ్రీనివాసరెడ్డి ని హీరో అనడం కంటే ఓ పాత్ర అనుకోవడం బెటర్. తన కామెడీ టైమింగ్ ఎప్పటిలానే ఉంది. ఆ పాత్రని సరిగా రాసుకోకపోవడం వల్ల పెద్దగా నవ్వించలేకపోయాడు. సత్య పాత్ర కూడా అంతే. ఉన్నంతలో షకలక శంకర్ కాస్త నవ్వించాడనుకోవాలి. బతుకు బడ్ల బండి ఎపిసోడ్ ఒక్కటి వర్కవుట్ అయ్యింది. హీరోయిన్‌లో ఆ లక్షణాలు కనిపించలేదు. రఘుబాబు కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. వెన్నెల కిషోర్‌నీ సరిగా వాడుకోలేదు.
* సాంకేతిక వర్గం
చాలా సాదా సీదా కథ ఇది. కామెడీ పండలేదు. సన్నివేశాల్ని సరిగా రాసుకోలేదు. తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమా చుట్టేయాలన్న తపన కనిపించింది. నేపథ్య సంగీతం సాదాసీదాగా ఉంది. పాటలూ అంతే. దర్శకుడిగా శ్రీనివాసరెడ్డికి ఇదే తొలి సినిమా. ఆ అనుభవ లేమి స్పష్టంగా కనిపించింది. మంచి కథ, కథనాలున్న సబ్జెక్ట్ ఎంచుకోవాల్సింది. ఇలాంటి సినిమాలకు దర్శకత్వం వహించడం వల్ల, నటుడిగా తన కెరీర్ ప్రమాదంలో చిక్కుకుంటుంది.
* విశ్లేషణ
కథ అంత గొప్పగా లేకపోయినా - కామెడీ పండించడానికి మాత్రం అనువుగా ఉంది. కాకపోతే ట్రాకులు ఎక్కువ. ఓ పక్క షార్ట్ ఫిల్మ్ గొడవ, ఇంకోపక్క డ్రగ్స్ మాఫియా, మరోవైపు లాటరీ టికెట్టు కోసం ఛేజింగులు.. ఇలా చాలా ఉపకథలున్నాయి. వాటన్నింటికీ సమన్వయ పరుస్తూ, అనుక్షణం నవ్విస్తూ, గమ్మత్తైన స్క్రీన్ ప్లేతో ఈ సినిమా నడిపించాలి. కానీ.. అదే కరువైంది. కథలో సన్నివేశాలు, అందులో హాస్యనటులు చాలామంది ఉన్నా - ఫన్ లేదు. స్క్రీన్ ప్లే అనేది నీరసంగా తయారైంది. ఓ సీనూ నవ్వించలేదు. పైగావిసుగు పుట్టించేలా తయారైంది. హీరోయిన్ ముందు శ్రీనివాసరెడ్డి వసంత కోకిలలో కమలహాసన్‌లా కోతి వేషాలు వేసినప్పుడే - ఈ సినిమా డ్రాప్ అయిపోయింది. పసలేని విలన్ గ్యాంగ్, కసి లేని పోలీస్ ఆఫీసర్ - బాగా నస పెట్టారు. హీరోయిన్ పాత్రని తీర్చిదిద్దిన విధానం మరింత కంపరంగా అనిపిస్తుంది. ఆ పిచ్చి నటన అస్సలు చూళ్లేం.
విశ్రాంతి సమయానికే సగం జ్యూస్ లాగేశాడు దర్శకుడు. మిగిలినదంతా సెకండాఫ్‌లో పిండుకున్నాడు. బతుకు ఎడ్ల బండి సీన్‌లో మాత్రం కాస్త కామెడీ పండింది. అందులోనూ ఓవర్ యాక్టింగే. కాకపోతే అప్పటి వరకూ నడిచిన కామెడీతో పోలిస్తే ఇదే కాస్త బెటర్ అనుకోవాలి. క్లైమాక్స్ మరీ సుదీర్ఘంగా సాగింది. అన్ని పాత్రల్నీ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి - కామెడీ పేరుతో కిచిడీ చేశారు. రసగుల్లా ఎపిసోడ్ మరీ సుదీర్ఘంగా సాగింది.
ఈ సినిమా ట్యాగ్ లైన్ `రసగుల్ల లాంటి సినిమా`. ఆ ట్యాగ్ లైన్ కి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ సీన్‌ని మరింత లాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ముగ్గురు హీరోలున్నా ఎవరి పాత్రనీ సరిగా తీర్చిదిద్దలేదు. విలన్ గ్యాంగ్ వేస్టయిపోయింది. హీరోయిన్ పాత్రని సరిగా వాడుకోలేదు. మొత్తానికి తెర అంతా నటులే కనిపించినా ఎవరికీ సరైన ప్రాధాన్యం దక్కలేదు.
* ప్లస్ పాయింట్స్
టైటిల్
నటీనటులు
* మైనస్ పాయింట్స్
కామెడీ లేకపోవడం
విసుగెత్తించే కథనం
* ఫైనల్ వర్డిక్ట్: రసం పిండేశారు
- రివ్యూ రాసింది శ్రీ