తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం నందమూరి బాలకృష్ణ తన సినిమా 'ఎన్‌టిఆర్ బయోపిక్'ని కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తించారు. తన సినీ గ్లామర్‌ని తెలుగుదేశం పార్టీ కోసం వినియోగించడం వరకూ బాలయ్యను తప్పుపట్టలేం. అయితే, ఈ క్రమంలో బాలకృష్ణ ప్రదర్శించిన అత్యుత్సాహం అభాసుపాలయ్యింది.
'సారే జహాసే అచ్చా..' అంటూ సాగే దేశభక్తి గీతం బాలయ్య నోట తప్పుగా రావడం పట్ల అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీకి తెలంగాణలో ప్రత్యర్థి అయిన టీఆర్‌ఎస్, తెలుగుదేశం నేత, భారతదేశం పరువు తీశారంటూ టీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు చిన్నా చితకా తప్పులు దొర్లవచ్చుగాక. ఆ మాత్రందానికే 'బాలయ్య కామెడీ చేశాడు..' అనీ, 'దేశం పరువు తీశాడనీ' అనడం ఎంతవరకు సబబు?
అయితే ప్రజా ప్రతినిథి కాబట్టి, బాలకృష్ణ ఇలాంటి సున్నితమైన అంశాల దగ్గరకొచ్చేసరికి కొంత అప్రమత్తంగా వుండి వుండాల్సింది. తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగున్నరేళ్ళ పాలనపై బాలకృష్ణ, తన ప్రచారంలో ఘాటైన విమర్శలు చేశారు. 'హైద్రాబాద్ అందరిదీ' అనే సంకేతాల్ని ఆయన గట్టిగా పంపడంలో సఫలమయ్యారు. సోదరుడు హరికృష్ణ కుమార్తె సుహాసిని తరఫున ఉధృతంగా ప్రచారం కూకట్‌పల్లిలో నిర్వహించడంతోపాటు, తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లోనూ బాలయ్య ప్రచారం జరిగింది. ప్రచార గడువు నేటితో ముగియనుండడంతో ఇకపై పూర్తిగా బాలయ్య, 'ఎన్‌టిఆర్ బయోపిక్' మీదనే ఫోకస్ పెడతారు.