నగరిలో మరోసారి జెండా ఎగరేసి, ఎమ్.ఎల్.ఏగా శాసన సభలో అడుగుపెట్టబోతోంది రోజా. అయితే ఈసారి రోజాకి మంత్రిపదవి ఖాయం అని ప్రచారం జరిగింది. ఏకంగా ఆమెను హోం మంత్రి చేస్తారని భావించారు. స్పీకర్ అవుతుందని కూడా జోరుగా ప్రచారం జరిగింది. రోజా స్పీకర్ పదవి మీద అంతగా ఆసక్తి చూపించకపోవడంతో మంత్రుల జాబితాలో ఏదో ఓ బెర్తు ఖాయం అవుతుందని ఆశించారు. కానీ ఇప్పుడు ఆ రెండూ దక్కలేదు. రోజాకి మంత్రి పదవి దక్కకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఎన్నికలలో వైకాపా తరపున ఫైర్ బ్రాండ్‌గా నిలిచారామె.
రోజా స్పీచులు, విమర్శలు అదిరిపోయాయి. పైగా నగరి నియోజకవర్గంలో జరిగిన రసవత్తరమైన పోరులో ఆమె గెలిచారు. ఇవన్నీ చూస్తే... మంత్రిగా రోజా ప్రమాణ స్వీకారం చేయడం గ్యారెంటీ అనుకున్నారు. రోజా కూడా అదే ఊహల్లో తేలియాడింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తనకు మంత్రి పదవి రాకపోవడంతో రోజా మనసు చిన్నబుచ్చుకున్నదని, ఆమెను బుజ్జగించడానికి పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. రోజాని స్పీకర్‌గా చూడాలని జగన్ భావించారని, స్పీకర్ వద్దనుకుంటే మంత్రి పదవి వస్తుందని ఆశించారని, కానీ. ఇప్పుడు రెండూ రాకుండా పోయాయని రోజా సన్నిహితులు వాపోతున్నారు. పాపం.. రోజా.. అన్యాయమైపోయిందిలా!