పవన్ కల్యాణ్ అభిమానులు నైరాశ్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోవడం, స్వయంగా పవన్ కల్యాణే రెండు చోట్లా గెలుపు ముంగిట బోర్లా పడడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన జెండా ఎత్తేస్తారని, పవన్ కల్యాణ్ ఇక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని ఊహాగానాలు కూడా వినిపించాయి. అవి పవన్ ఫ్యాన్స్‌లో మరింత నిరుత్సాహాన్ని తీసుకొచ్చాయి. అయితే పవన్ ఈ ఓటమిని స్వీకరించిన విధానం మాత్రం కొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తున్నట్టే ఉంది. ఓటమి అనంతరం కూడా పవన్ ధీమాగా కనిపించడం, అంతకు ముందులానే ధైర్యంగా మాట్లాడడం ఊరట నిస్తున్న అంశాలు.
ఒక్క ఓటమితో జనసేనని ఆపలేరని, తనని కాటికి నలుగురు మోసుకెళ్లేవరకూ జనసేనని వదలనని పవన్ ప్రకటించడం తో అభిమానులు మళ్లీ ఊపిరి తీసుకున్నారు. భీమవరంలో తనని ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు పెట్టారని, అయితే తనని ఎంత అగణదొక్కాలని చూస్తే అంతగా రెచ్చిపోతానని పవన్ ఉద్వేగంగా మాట్లాడడం - అభిమానులకూ నచ్చింది. సమస్య ఎక్కడుంటే, కష్టం ఎక్కడుంటే, క్షోభ ఎక్కడుంటే అక్కడ జనసేన గుర్తుకురావాలని అభిమానులకు పవన్ పిలుపునిచ్చాడు. ఇదంతా చూస్తుంటే పవన్ ఓ ఓటమిని ఓ పాజిటీవ్ యాంగిల్‌లోనే చూస్తున్నాడన్న విషయం అర్థమైంది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పవన్ మాటలు, అభిమానుల్లో ధైర్యాన్ని నింపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.