డైరెక్టర్ క్రిష్ ఈమధ్య మెగా హీరో వైష్ణవ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఓ కొత్త సినిమాను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడి గురించి ఓ ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.
ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తారట. కీరవాణి ఈమధ్య చాలా తక్కువ సినిమాలకు మాత్రమే సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలు కాకుండా ఇతర దర్శకులు రూపొందించే సినిమాలకు ఆయన సంగీతం అందించడం చాలా అరుదు. ఇలాంటి నేపథ్యంలో క్రిష్ - వైష్ణవ్ తేజ్ సినిమాకు ఆయన సంగీతం అందించడం ఒక గొప్ప విషయమే. కీరవాణి లాంటి అనుభవజ్ఞుడు అయిన సంగీత దర్శకుడు టీమ్ లో ఉండడం వలన ఈ సినిమా స్థాయి మరింతగా పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ సినిమాను క్రిష్ 40 రోజుల్లోనే పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకే షెడ్యూల్లో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ వికారాబాద్ అడవుల్లోని అనంతగిరి హిల్స్ ప్రాంతంలో జరుగుతుందట.