ప్రభాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్టు `ఆది పురుష్`. దాదాపు 400 కోట్లతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రభాస్ నటిస్తున్న తొలి హిందీ చిత్రం కూడా ఇదే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలైపోయాయి. ప్రభాస్ తో పాటు మరికొంత మంది బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లు ఈ సినిమాలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సినిమా వెనుక బీజేపీ హస్తం కూడా ఉందని టాక్. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ పార్టీ వారే. ప్రస్తుతం కేంద్రంలోనూ, చాలా రాష్ట్రాలలోనూ బీజేపీ అధికారంలో ఉంది. హిందూ మతాన్ని, దాని గొప్పతనాన్ని ప్రచారం చేసి, బీజేపీ వైపు ప్రజల్ని ఆకర్షించడానికి ఆ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. పైగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా మొదలైపోయింది. ఇలాంటి సమయంలో... రామాయణం ఆధారంగా ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కడం బీజేపీకి ఖచ్చితంగా ప్లస్ పాయింటే. అందుకే... ఈ సినిమాలో బీజేపీ పెద్దల హ్యాండ్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి బీజేపీ నాయకులు వద్దన్నా భారీ ఎత్తున ప్రచారం చేసి పెడతారని ఇండ్రస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.