డైలాగ్ కింగ్ మోహన్‌బాబు ప్రస్తుతం సో బిజీగా గడిపేస్తున్నారు. ఎందుకు, ఎవరితోనంటారా? న్యూ ఇయర్‌లో మంచు ఫ్యామిలీకి వచ్చిన కొత్త అతిథితో. మొదటి కాన్పులో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన విష్ణు భార్య విరానికా రెండవ కాన్పులో ఇటీవల ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఓ ట్వీట్ చేశారు.
మూడు షిఫ్ట్‌లు మనవడితోనే గడుపుతున్నాను. తన పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారితో అలా టైం కేటాయించలేకపోయాను. మూడు షిఫ్టులూ షూటింగ్ కోసమే కేటాయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం పొద్దున్న, మద్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు షిఫ్టులూ ఆనందంగా మనవడితోనే గడుపుతున్నాను అని చెప్పారు మోహన్‌బాబు.
మోహన్‌బాబు ప్రస్తుతం 'గాయత్రి' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని మోహన్‌బాబు తన సొంత బ్యానర్ అయిన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. మోహన్‌బాబు పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా కొత్తగా ఉండబోతోందట ఈ సినిమాలో. ఇంతవరకూ హీరోగా, విలన్‌గా, పలు విలక్షణ పాత్రల్లో నటించిన మోహన్‌బాబు చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'.
ఈ సినిమాతో సరికొత్త గెటప్‌తో సరికొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆశక్తిని పెంచుతున్నాయి. చాలా పవర్‌ఫుల్‌గా 'గాయత్రి' సినిమాలో కన్పించనున్న మోహన్‌బాబు, ఈ సినిమాలోని ఎమోషనల్ కంటెంట్‌తో ప్రతి ఒక్కరూ బాగా కనెక్ట్ అవుతారనే ధీమాతో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.