నటుడిగా దాదాపు యాభై ఏళ్ల ప్రస్థానం మోహన్ బాబుది. నిర్మాతగా విజయవంతమైన చిత్రాలు అందించారు. ఆయన కథకుడు. స్క్రీన్ ప్లే రచయిత కూడా. త్వరలో రాబోతున్న `సన్నాఫ్ ఇండియా` కు ఆయనే స్క్రీన్ ప్లే అందించారు. అయితే మోహన్ బాబుకి దర్శకత్వం పై గురి ఉంది. కానీ ఇప్పటి వరకూ ఆ ప్రయత్నం చేయలేదు. త్వరలోనే... మోహన్ బాబు దర్శకత్వం చేసే ఛాన్సుంది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.
దర్శకత్వం చేయాలని వుంది, రెండు కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి, అయితే... నేను సెట్లో చాలా కఠినంగా ఉంటాను. ఎవరైనా తప్పు చేస్తే కొడతానేమో అని భయం... అందుకే ఆలోచిస్తున్నా... అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. సెట్లో వృథా చాలా అవుతోందని, చాలామంది కార్ వాన్లలోనే కాలం గడుపుతున్నారని, తమ కాలంలో కార్ వాన్ల సదుపాయమే లేదని గుర్తు చేసుకున్నారు. ``నిర్మాత గా కూడా నేను చాలా స్ట్రిక్ట్. ఉదయం ఏడింటికి షూటింగ్ మొదలు కావాల్సిందే. బేరం ఆడుకుని మరీ.. నేను నటీనటుల్ని ఎంచుకుంటాను. రూపాయి తక్కువ ఇచ్చినా.. పర్‌ఫెక్ట్ గా పేమెంట్ ఉంటుంది. నాకు అనువైన వాళ్లనే సినిమాల్లో తీసుకుంటా`` అన్నారు మోహన్ బాబు. ఆయన నటించిన `సన్నాఫ్ ఇండియా` ఈనెల 18న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు.