రాజకీయాలంటేనే కుళ్లూ, కుతంత్రాలని... వాటిలోకి నాలాంటి వాళ్లు రాకపోవడమే మంచిదని... మోహన్ బాబు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావడం లేదంటూ...రజనీ ఇటీవల ఓ కీలకమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మోహన్ బాబు స్పందించారు. తన మిత్రుడికి రాజకీయాలు పడవని, రాజకీయాల్లోకి రాకుండా మంచి నిర్ణయం తీసుకున్నాడని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ మేరకు.. మోహన్ బాబు ఓ లేఖ విడుదల చేశారు.
``రజినీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. తన ఆరోగ్య రీత్యా పాలిటిక్స్ లోకి రావడం లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధ అయినప్పటికీ ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన ఉన్న ఒక వ్యక్తిగా రజినీ రాజకీయాల్లోకి రాకపోవడం మంచిది అని నమ్ముతున్నాను.
నా మిత్రునితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు మంచివాడివి. చీమకు కూడా హాని చేయని వాడివి. నా దృష్టిలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్.. నీ లాంటి వ్యక్తికి, నాలాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికి ద్రోహం చేయం. డబ్బులు ఇచ్చి ఓట్లు, సీట్లు కొనలేం. కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు.
రాజకీయాల్లోకి రానంత వరకు మంచి వాడివి అన్న వాళ్లే.. రేపు వచ్చిన తర్వాత చెడ్డవాడని అంటారు. రాజకీయం ఒక రొచ్చు. ఒక బురద. ఆ బురద అంటకుండా నువ్వు రాక పోవడమే మంచిదయ్యింది. రజనీకాంత్ అభిమానులు అందరూ రజనీకాంత్ అంత మంచి వాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడు తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను`` అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు మోహన్ బాబు.