తమిళ నటుడు సూర్య తాజా చిత్రం 'సురారై పొట్రు' లో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ సినిమా షూటింగ్‌లో రేపట్నుంచి మోహన్‌బాబు జాయిన్ కానున్నారు. ఈ విషయాన్ని మోహన్‌బాబు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. 'సాలా ఖడూస్' (తెలుగులో 'గురు') చిత్రంతో దర్శకురాలిగా సుధా కొంగర సుపరిచితురాలు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సూర్యతో తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక సూర్య ఇటీవల 'ఎన్జీకే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఈ మధ్య సూర్య సినిమాలకు తెలుగులో మార్కెట్ కాస్త డల్ అయ్యిందనే చెప్పాలి. అంతకు ముందు వచ్చిన చిత్రాలు కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు అందుకోలేకపోయాయి. ఈ సినిమాతోనైనా సూర్య అంచనాల్ని అందుకుంటాడేమో చూడాలి మరి. మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు విషయానికి వస్తే, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న ఆయన ఈ మధ్య ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. నిర్మాతగానూ అభిరుచి గల సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం మరే ఇతర సినిమాలకూ ఆయన సైన్ చేయలేదు. తెలుగులో మోహన్‌బాబు చివరిగా 'మహానటి' చిత్రంలో కనిపించారు. సూర్య సినిమాలో కీలక పాత్ర కోసం ఆయనను ఏరి కోరి ఎంచుకోవడం జరిగింది.