నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలం నుంచి అభిమానులు ఎదరు చూస్తున్నారు. `ఇదిగో వస్తున్నాడు... అదిగో వస్తున్నాడు` అని ఊరిస్తున్నారు కానీ, మోక్షజ్ఞ ఎంట్రీ గురించిన ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే.. అనిల్ రావిపూడి దగ్గర్నుంచి బోయపాటి శ్రీను వరకూ చాలామంది దర్శకుల పేర్లు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా కోసం వినిపించాయి. అందులో కొంత నిజం లేకుండా పోలేదు. అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు.. మోక్షజ్ఞ ఎంట్రీ కల అలానే ఉండిపోయింది. మోక్షజ్ఞ చాలా లావుగా ఉన్నాడని, తను స్లిమ్ గా, ఫిట్ గా అయిన తరవాతే.. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని, ప్రస్తుతం ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొన్నారు.
ఇటీవల మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా సెట్లో మోక్షజ్ఞ కేక్ కట్ చేశాడు. అక్కడి ఫొటో ఒకటి బాగా వైరల్ అయ్యింది. అందులో మోక్షజ్ఞ కొంచెం బొద్దుగానే ఉన్నాడు. అది చూసి ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ పడుతున్నారు. హీరో గా మారడానికి మోక్షజ్ఞ ఇంకా సిద్ధం కాలేదని ఆ ఫొటో చూస్తే అర్థమైపోతోంది. మోక్షజ్ఞ ఫిట్ గా మారాలంటే కనీసం మరో యేడాది కసరత్తు చేయాల్సిందే. అంటే ఈ యేడాది కూడా మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టే. కాకపోతే... గతంలో కంటే ఇప్పుడు కాస్త స్లిమ్ అయ్యాడు. ఈ విషయంలో కాస్త ఊరట లభించిందంతే.