పవన్ కల్యాణ్ కెరీర్‌లో రీమేక్ సినిమాల వాటానే ఎక్కువ. ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలు సైతం రీమేకులే. సముద్రఖని దర్శకత్వంలో చేస్తున్న కథ కూడా సొంతం కాదు. అది కూడా రీమేకే. ఇప్పుడు సాహో దర్శకుడు సుజిత్ తో ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు పవన్. ఇది `తేరి` సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది. `తేరి` సినిమా హక్కుల్ని డివివి దానయ్య ఎప్పుడో సొంతం చేసుకొన్నారు. ఇప్పుడు ఈ సినిమాకి ఆయనే నిర్మాత.
అంటే.. పవన్ నుంచి వరుసగా నాలుగో రీమేక్ అన్నమాట. పెద్ద హీరోలంతా ఒర్జినల్ కథలు, పాన్ ఇండియా సబ్జెక్టులతో ముందుకు వెళ్తుంటే.. పవన్ మాత్రం ఇలా రీమేకుల్ని నమ్ముకోవడం అభిమానులకు అసంతృఫ్తి కలిగిస్తోంది. ఓ భాషలో హిట్టయిన సినిమాని మళ్లీ కొత్తగా చూడడంలో కిక్ ఉండదు. పవన్ ని కొత్త తరహా పాత్రలో చూడాలన్నది అభిమానుల ఆశ, ఆకాంక్ష. పవన్ శ్రద్ధ పెడితే.. కొత్త కథలు తప్పకుండా వస్తాయి. కానీ పవన్ రిస్క్ చేయదలచుకోలేదు.
ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ఒక్కో కథపై యేడాది కూర్చోవడం పవన్ కి సుతారమూ ఇష్టం లేదు. అందుకే ఆల్రెడీ హిట్టయిపోయిన కథల్ని తీసుకొచ్చి రీమేకులు చేస్తున్నాడు. ఆ కోవలో మరో రీమేక్ వచ్చి చేరిందంతే. పవన్ చేస్తున్న సినిమాల్లో ఒరిజినల్ కథ.. `హర హర వీరమల్లు`.అయితే ఆ సినిమా షూటింగ్ నత్త నడక నడుస్తోంది.