ఈ దసరాకి విడుదలైన సినిమాల్లో అంతో కొంత పాజిటీవ్ వైబ్స్ తెచ్చుకున్న సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`నే. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ఇది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మంచి వసూళ్లే వస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమా లాభాల బాట పట్టేసింది. ఓవర్సీస్ హక్కుల్ని కోవిడ్ కి ముందే.. 1.7 కోట్లకు అమ్మేశారు. అయితే ఆ తరవాత కోవిడ్ రావడం వల్ల, అక్కడ ధియేటర్లన్నీ మూతపడ్డాయి. అందుకే బయ్యర్ కి తిరిగి 70 లక్షలు ఇచ్చేశారు. అంటే.. ఓవర్సీస్ రేటు కోటి రూపాయలన్నమాట. ఇప్పుడు ఆ కోటీ.... వచ్చేసింది. సోమవారం నుంచి ఓవర్సీస్ లో వచ్చే ప్రతీ డాలరూ... లాభమే అన్నమాట.
కోవిడ్ తరవాత... ఓవర్సీస్‌లో మెల్లమెల్లగా థియేటర్లు ఓపెన్ చేస్తున్నారు. `లవ్ స్టోరీ`తో అక్కడి మార్కెట్ కి ఊపొచ్చింది. ఆ సినిమాకి మంచి వసూళ్లే దక్కాయి. ఆ తరవాత తమిళ చిత్రం `వరుణ్ డాక్టర్`కీ ఓపెనింగ్స్ బాగున్నాయి. ఇప్పుడు అఖిల్ సినిమా తన జోరు చూపిస్తోంది. శేఖర్ కమ్ముల, భాస్కర్.. వీళ్ల సినిమాలకు ఓవర్సీస్ లో మంచి గిరాకీ ఉంటుంది. అది... బ్యాచిలర్ కి బాగా కలిసొచ్చింది.