అఖిల్ టైమ్ ఏమాత్రం బాగాలేనట్టే కనిపిస్తోంది. వరుసగా.. ఒకదాని తరవాత మరో సినిమా ఫ్లాప్. హ్యాట్రిక్ ఫ్లాపులతో.. చాలా భారమైన ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. తన నాలుగో సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` కూడా కష్టాల్లోనే ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. పూజా హెగ్డే కథానాయిక. రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. పలుమార్లు సినిమా విడుదల వాయిదా వేశారు. ఇప్పుడు ఎలాగూ లాక్ డౌన్ ఎఫెక్ట్ పడింది.
ఇక మళ్లీ థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో.. ఎప్పుడు ఈసినిమా విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి దాపురించింది. థియేటరికల్ రిలీజ్ లేకపోయినా ఫర్వాలేదు అనుకున్న కొన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. అయితే ఈ సినిమాకి ఆ ఆప్షన్ కూడా లేదు. `ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని థియేటర్‌లోనే విడుదల చేయాలి` అని నాగార్జున గట్టి కండీషన్ పెట్టాడట. అయితే.. అసలు నిజం ఏమిటంటే.. ఈ సినిమాని కొనడానికి ఓటీటీ సంస్థలు కూడా రెడీగా లేవు. గీతా ఆర్ట్స్ తెరకెక్కించిన సినిమా ఇది. అల్లు అరవింద్ నిర్మాత. ఆయన సొంత ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమాని విడుదల చేయాలి. అయితే దానిక్కూడా ఆయన సుముఖంగా లేరని టాక్.