అ, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలతో ఆకట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ. జాంబీ రెడ్డి సమయంలో సమంత కోసం ఓ కథ సిద్ధం చేశాడని, త్వరలోనే సమంతతో ఆ సినిమా పట్టాలెక్కించబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకూ ఆ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేటూ లేదు. ఎట్టకేలకు ఈ సినిమాపై స్పందించాడు ప్రశాంత్ వర్మ.
``సమంత కోసం ఓ కథ రెడీ చేసిన మాట వాస్తవమే. ఇప్పటికీ ఆమెతో టచ్‌లోనే ఉన్నా. అయితే.. తను ఖాళీగా ఉన్నప్పుడు నేను వేరే సినిమాతో బిజీ అయ్యాను. నేను ఖాళీగా ఉన్నప్పుడు తాను బిజీ అయ్యింది. అలా ఇద్దరికీ కుదర్లేదు. ఇద్దరికీ సమయం చిక్కినప్పుడు ఆ సినిమా తప్పకుండా సెట్స్‌పైకి వెళ్తుంది`` అని క్లారిటీ ఇచ్చాడు. తన తదుపరి సినిమాల గురించి చెబుతూ ``ఇప్పటి వరకూ వెరైటీ కాన్సెప్టులనే కథలుగా ఎంచుకున్నాను. ఈసారి ఫక్తు కమర్షియల్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. వివరాలు త్వరలో చెబుతా`` అంటున్నాడు ప్రశాంత్ వర్మ.