ఈ వారం ఏకంగా 5 సినిమాలు విడుదలయ్యాయి. రాజుగారి గది 3, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, మళ్లీ మళ్లీ చూశా, సరోవరం, కృష్ణ సూపర్ మార్కెట్. తొలి రెండు సినిమాలపై ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి. కనీసం రాజుగారి గది 3 అయినా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనుకున్నారు. కానీ.. చిత్రంగా మూడింటికి మూడూ ఫ్లాపు టాకు మూటగట్టుకున్నాయి. సరికదా... కనీసం వీటికి ఓపెనింగ్స్‌కూడా దక్కలేదు. రాజుగారి గది 2లో నవ్వులు, భయం రెండూకరువైపోయాయి.
గత సినిమాల్లో ఉన్న వైవిధ్యం, వినోదం ఈ సినిమాలో మచ్చుకైనా కనిపించలేదు. తొలి సగం స్క్రీన్ ప్లే మరీ బోరింగ్‌గా సాగింది. దాంతో... రాజుగారి గది ఈ సారి మెప్పించలేకపోయింది. సరైనప్రమోషన్ లేకపోతే సినిమాకి ఎలాంటి ఫలితం వస్తుందో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చూస్తే అర్థమవుతుంది. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. కనీసం ఈసినిమాకి ఓపెనింగ్స్ కూడా రాలేదు.
దానికి తోడు సినిమా కూడా డిజాస్టర్ అనిపించుకుంది. ఇక మళ్లీ మళ్లీ చూశా.. పరిస్థితీ ఇంతే. ఈసినిమాకి కనీసం థియేటర్లు కూడా లేవు. ఉన్నా అందులో జనం లేరు. మిగిలిన రెండు సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుంది వ్యవహారం. ఈ వారం సినిమాలేం లేకపోవడంతో `సైరా` వసూళ్లకు మళ్లీ కాస్త ఊపొచ్చింది. కుటుంబం అంతా కలిసి చూడదగిన సినిమా ఇప్పుడు అదొక్కటే.