సినిమా ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అసలే నిర్మాతల పరిస్థితి అంతంతమాత్రం. ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో తెలీదు. సినిమా హిట్టయినా చేతుల్లో డబ్బులు మిగులుతాయే లేదో తెలీదు. సినిమా మొదలైనా, ఎప్పుడు విడుదల అవుతుందో తెలీదు. అన్నీ సమస్యలే. ఇప్పుడు కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. ఈ దెబ్బకు నిర్మాతే కాదు, చిత్రసీమ మొత్తం కుదేలైపోయింది. లాక్ డౌన్ ఎత్తేసినా, థియేటర్లు రీ ఓపెన్ అవ్వడం కష్టమని, ఒకవేళ తెరచుకున్నా - ఇది వరకటిలా ప్రేక్షకులు థియేటర్లకు రారని బడా బడా నిర్మాతలే అభిప్రాయ పడుతున్నారు. మరి సినిమా పరిస్థితేంటి? ప్రేక్షకులకు వినోదం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం గా నిలుస్తున్నాయి ఓటీటీ వేదికలు.
అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్, ఆహా లాంటి ఓటీటీ వేదికలే ఇప్పుడు పెద్ద దిక్కుగా మారాయి. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తయిపోయి, విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాలు - ఓటీటీ వైపుకు ఆశగా ఎదురు చూస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తేశాక, ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకునే సినిమాలకు సైతం ఓటీటీనే పెద్ద దిక్కు. 2020లో సినిమాలేవీ థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. ఆడించుకుంటే... ఓటీటీలో ఆడించుకోవాలి. భవిష్యత్తులో కూడా నిర్మాతలు సినిమాలు తీయాలంటే భయపడే స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ల ముందున్న మార్గం ఒక్కటే. ఓటీటీలో అమ్ముకోవడానికే సినిమాలు తీయడం.
థియేటర్లకు జనాలు రారు... మన సినిమా థియేటర్లో ఆడదు అనుకుని ఫిక్సయిపోయిన నిర్మాతలే సినిమాలు తీయడానికి ధైర్యం చేస్తారేమో అనిపిస్తోంది. ఇప్పుడు దర్శకుల ముందు మరో మార్గం కూడా ఉంది. అదేంటంటే.. ఓటీటీలనే నిర్మాతలుగా మార్చుకోవడం. అంటే... ఓ స్క్రిప్టును అమేజాన్, హాట్ స్టార్ లాంటి సంస్థలకు వినిపించి, వాళ్లతోనే పెట్టుబడి పెట్టించుకోవడం. అంటే.. ఓటీటీ సంస్థలే భవిష్యత్తులో సినిమాలు నిర్మించుకుంటాయన్నమాట. ఇదే జరిగితే.. పంపిణీదారులు, ప్రదర్శన కారులు అనే వ్యవస్థలే కనుమరుగైపోతాయి. సినిమా మొత్తం ఓటీటీ వ్యవస్థల చుట్టూనే తిరుగుతాయి. భవిష్యత్లులో చిత్రసీమ ఈ దిశగా అడుగులేస్తే... ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు ఇండిపెండెంట్ సినిమాలు తీస్తున్నాయి.
ఇక మీదట.. ఫీచర్ ఫిల్మ్స్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. డి.సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతలు కూడా ఈ విషయమే గట్టిగా చెబుతున్నారు. చిత్రసీమలో ఊహించని పరిణామాలు రాబోతున్నాయని, సినిమాని ప్రదర్శించే వేదికలు మారబోతున్నాయని, దానికి తగ్గట్టు చిత్రసీమ సంసిద్ధం కావాలని, మార్పుని అంగీకరించాలని ముందే.. మేల్కొలుపు గీతాలు పాడుతున్నారు. మరి 2021లో చిత్రసీమ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఈ మార్పు.. ఎన్ని పరిణామాలకు దారులు తీస్తాయో మరి!