గత దశాబ్దకాలంలో వచ్చిన గొప్ప చిత్రాల్లో `ప్రస్థానం` ఒకటి. సాయి కుమార్ నటన, దేవాకట్టా కథని నడిపించిన విధానం, కథలోని ఎమోషన్... `ప్రస్థానం`ని మంచి చిత్రాల సరసన నిలబెట్టింది. ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేశారు. దేవాకట్టానే దర్శకుడు. సంజయ్‌దత్ లాంటి స్టార్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించాడు. కానీ.. సినిమా మాత్రం ఫ్లాప్. తెలుగులో ఇంత మంచి విజయాన్ని అందుకుని, విమర్శకుల్ని మెప్పించిన కథ.. హిందీలో బోల్తా కొట్టడానికి కారణాల్ని విశ్లేషించాడు దర్శకుడు దేవాకట్టా.
ఏడేళ్ల క్రితమే ఈ సినిమా హిందీలో రీమేక్ అవ్వాల్సిందని, అయితే సంజయ్ దత్ జైలుకి వెళ్లడం వల్ల కుదర్లేదని, ఆయన జైలు నుంచి విడుదల అవ్వడం, ఈ సినిమాని పూర్తి చేయడం జరిగాయని, చిత్రీకరణలో ఆలస్యం వల్ల, మాతృకకీ, రీమేక్ కీ చాలా గ్యాప్ రావడం వల్ల `ప్రస్థానం` హిందీలో నిలబడలేకపోయిందని తేల్చేశాడు దేవాకట్టా. రీమేక్ ఎప్పుడైనా వేడి వేడిగా చేయాలి. చల్లారిపోతే ఇలాంటి పరిణామలే ఎదురవుతాయి. బహుశా ప్రస్థానం రీమేక్ ఫలితం అనేది ఇప్పటి దర్శకులకు పాఠంగా మిగలొచ్చు.