మురుగదాస్ సినిమాల విషయంలో కథలు నావంటే నావి అంటూ వివాదాలు తలెత్తుతుంటాయి. వేరే వాళ్ల కథల్ని మురుగదాస్ కాపీ కొట్టేస్తాడనే వదంతు ఉంది. గతంలో 'కత్తి' సినిమా టైంలో ఇలాంటి వివాదాలే తలెత్తాయి. తమిళ 'కత్తి' తెలుగులో 'ఖైదీ నెంబర్ 150'గా విడుదలైంది. చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా ఇలాంటి వివాదాల్నే ఎదుర్కోవాల్సి వచ్చింది.
కాగా మురుగదాస్ తాజా చిత్రం 'సర్కార్'దీ ఇప్పుడిదే పరిస్థితి. 'సర్కార్' కథ నాదేనంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. దాంతో సినిమా విడుదలకు ముందు వివాదాల గోలెందుకులే అని మురుగదాస్ ఈ వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించాడనీ తెలుస్తోంది. సదరు వ్యక్తికి 30 లక్షల నగదునిచ్చి ఈ వివాదాన్ని సెటిల్ చేశాడనీ సమాచారమ్. అంతేకాదు, టైటిల్స్‌లో కూడా ఆయన పేరు వేస్తానని మురుగదాస్ మాటిచ్చాడంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో మురుగదాస్ అంటే ఎంతో గౌరవముంది. అలాంటిది ఆయన విషయంలో ఇలాంటి వివాదాలు తలెత్తడం బాధాకరం. మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్, కీర్తిసురేష్ జంటగా నటించారు. పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం 'సర్కార్'.