`అరవింద సమేత వీర రాఘవ` చూసి ఎన్టీఆర్ అభిమానులు ముచ్చటపడ్డారు. త్రివిక్రమ్ బ్యాక్ అంటూ విశ్లేషకులు కీర్తించారు. తొలి మూడు రోజుల్లో వసూళ్లు కిర్రెక్కించాయి. తొలి వారమంతా వీర రాఘవుడిదే హావా. ఇప్పటి వరకూ రూ.88 కోట్ల షేర్ తెచ్చుకుంది.
అయితే ఏం లాభం..?? పంపిణీదారులకు నష్టాలు తప్పలేదు. 18 రోజుల షేర్ దాదాపుగా రూ.88 కోట్లగాలెక్క తేలింది. దాదాపు ఇక్కడితో అరవింద రన్ ఆగిపోతుంది. ఈ సినిమాకి మంచి రేట్లకు అమ్ముకున్న నిర్మాత సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయాడు. కానీ పంపిణీదారులు మాత్రం లాభాల్ని చూడలేకపోయారు. ఓవర్సీస్‌తో సహా దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి అని టాక్.
ఒక్క గుంటూరులోనే ఈ సినిమా కొన్న పంపిణీదారుడు లాభాల్ని చూశాడని, మిగిలినవాళ్లంతా 15 నుంచి 20 శాతం వరకూ నష్టపోయారని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. ఓ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినా - పంపిణీదారులు నష్టపోయారంటే.. టాలీవుడ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దసరా సీజన్‌లో విడుదల అవ్వడం కాస్త ఈ సినిమాకి కలిసొచ్చింది. లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదేమో.