మైత్రీ మూవీస్... టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాణ సంస్థ. హీరోలు, దర్శకులకు మైత్రీ ఇచ్చిన అడ్వాన్సులకు లెక్కేలేదు. ప్రతీ హీరో చేతిలో, ప్రతీ దర్శకుడి చేతిలో.. మైత్రీ ఇచ్చిన అడ్వాన్సు చెక్ ఉంటుంది. వాళ్లందరితో మైత్రీ ఎప్పుడు సినిమాలు చేస్తుందో తెలీదు గానీ, ఇప్పుడు మరో స్టార్ హీరోకి సైతం మైత్రీ మూవీస్ అడ్వాన్స్ ఇచ్చినట్టు టాక్. ఆ హీరోనే విజయ్. తమిళ సూపర్ స్టార్ విజయ్ ఇప్పుడు మైత్రీ లో ఓసినిమా చేయబోతున్నారు. ఇప్పటికే విజయ్ తో మైత్రీ మూవీస్ ఒప్పందాలు చేసేసుకుందని టాక్.
అయితే దర్శకుడెవరన్నది ఇంకా స్పష్టం కాలేదు. లోకేష్ కనగరాజ్‌కి మైత్రీ ఇది వరకే అడ్వాన్స్ ఇచ్చింది. విజయ్ - లోకేష్ కాంబినేషన్ లో ఇటీవలే `మాస్టర్` వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ కాంబోనే సెట్ చేస్తారా? లేదంటే... మరో దర్శకుడ్ని వెదికి పట్టుకుంటారా.? అనేది ఇంకా తేలలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే, ఓ తెలుగు దర్శకుడితోనే.. విజయ్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. సో.. ఆ దర్శకుడెవరన్నది ఇంకొద్ది రోజుల్లో తేలనుంది. మొత్తానికి మైత్రీ హావా ఇప్పుడ తమిళ చిత్రసీమకూ తాకింది. అక్కడ ఇంకెంత మంది హీరోలకు అడ్వాన్సులు ఇస్తుందో.?